Home / INTERNATIONAL / వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

2017 సంవత్సరానికి గాను నోబెల్ అసెంబ్లీ వైద్యశాస్త్రంలో అవార్డులను ప్రకటించింది. వైద్యశాస్త్రంలో అద్భుత కృషి చేసిన అమెరికాకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది.  కణజాల పనితీరుపై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ కమిటీ ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రకటించింది. మెడిసిన్ నోబెల్ గెలుచుకున్నవారిలో జెఫ్రీ సీ హాల్, మైఖేల్ రోస్బా, మైఖేల్ యంగ్ ఉన్నారు.

మాలిక్యులార్ మెకానిజమ్ ద్వారా సర్కేడియన్ రిథమ్‌ను కంట్రోల్ చేసే పద్ధతిపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. నోబెల్ ప్రైజ్ కింద విజేతలకు 7.3 కోట్ల రూపాయలు ఇస్తారు. ప్రతి ఏడాది నోబెల్ కమిటీ మెడిసిన్‌లో మొదటి నోబెల్‌ను ప్రకటిస్తుంది. డైనమైట్‌ను కనుగొన్న వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆదేశాల ప్రకారమే నోబెల్ కమిటీ ముందుగా సైన్స్ ఆ తర్వాత సాహిత్యం, శాంతి రంగాల్లో బహుమతులను ప్రకటిస్తుంది. మంగళవారం (అక్టోబర్-3) భౌతికశాస్త్రం, బుధవారం (అక్టోబర్-4) రసాయన శాస్త్రం, శుక్రవారం (అక్టోబర్-6) శాంతి విభాగాల్లో నోబెల్‌ అవార్డులను ప్రకటించనున్నారు. 1901 నుంచి ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను అందజేస్తున్నారు.