పేదోళ్ళ ఆశాదీపం.. నేడు కాకా 88వ జయంతి…! – Dharuvu
Home / EDITORIAL / పేదోళ్ళ ఆశాదీపం.. నేడు కాకా 88వ జయంతి…!

పేదోళ్ళ ఆశాదీపం.. నేడు కాకా 88వ జయంతి…!

‘కాకా’ అంటూ అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి రాజకీయాల్లో కాకలుతీరిన నేతగానే కాదు.. పేదల పెన్నిధిగానూ పేరు ప్రతిష్టలు సంపాదించారు. వెంకటస్వామి సేవలు గుడెసెల్లో ఉండే నిరుపేదలకు చిరస్మరణీయం. అందుకే ఇంటి పేరు గడ్డం మరుగున పడి, గుడిసెల వెంకటస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ రోజు  ఆయన 88వ  జయంతి. ఆది నుంచి కాంగ్రె్‌సను నమ్ముకొని చివరి శ్వాస వరకు అదే పార్టీలో కొనసాగారు. గడ్డం వెంకటస్వామి అక్టోబరు 5, 1929న జన్మించారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన 1957లో తొలిసారిగా ఉమ్మడి ఏపీ శాసనసభకు, 1976లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 7సార్లు ఎంపీగా గెలిచిన కాకా పలు దఫాలు కేంద్ర మంత్రి పదవులు నిర్వర్తించారు.
1982-84లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 2002-2004లో ఏఐసీసీ అనుబంధ ఎస్సీ-ఎస్టీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగానూ పనిచేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ద్వారా పలు విద్యా సంస్థలను ప్రారంభించారు. జాతీయ గుడిసెల సంఘం ప్రధాన కార్యదర్శిగా వెంకటస్వామి దాదాపు 75వేల మందికి ఆవాసం కల్పించడంలో క్రియాశీలకపాత్ర పోషించారు. ఆయనకు సింగరేణి బొగ్గు గని కార్మికులతోనూ అనుబంధం ఉంది. దాదాపు 101 కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ కోసం తపించిన కాకా రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూశారు. తీవ్ర అనారోగ్యంతో 2014 డిసెంబరు 22న మృతి చెందారు. ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రత్యేక చొరవతో వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయించారు.
ఈ రోజు  కాకా 88వ జయంతి సందర్భంగా  ట్యాంక్ బండ్ లోని సాగర్ పార్క్ లో  విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్. వీరితోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అభిమానులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు హజరుకానున్నారు.  కాకా జయంతి వేడులకను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. జయంతివేడుకల  ఏర్పాట్లను HMDA కు అప్పగించింది. దీంతో కాకావిగ్రహం ఉన్న సాగర్ పార్కును  సుందరంగా ముస్తాబు చేశారు.