ఆ ఘనత అనురాగ్‌శర్మకే దక్కుతుంది..సీఎం కేసీఆర్ – Dharuvu
Breaking News
Home / SLIDER / ఆ ఘనత అనురాగ్‌శర్మకే దక్కుతుంది..సీఎం కేసీఆర్

ఆ ఘనత అనురాగ్‌శర్మకే దక్కుతుంది..సీఎం కేసీఆర్

డీజీపీగా పదవీ విరమణ చేసిన అనురాగ్‌శర్మకు ప్రగతిభవన్‌లో ప్రభుత్వం తరపున ఘనంగా విడ్కోలు పలికారు. అనురాగ్‌శర్మను సీఎం కేసీఆర్ సన్మారించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే అపోహలను, దుష్ప్రచారాలను పటాపంచలు చేసినం. తెలంగాణను సహనశీల రాష్ట్రంగా ఆవిష్కరించిన ఘనత పోలీసు శాఖకు, మూడున్నరేళ్లపాటు డీజీపీగా పనిచేసి పోలీసులకు నాయకత్వం వహించిన అనురాగ్‌శర్మకు దక్కుతుందని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసింగ్ కొత్త విధానాలు అమలు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలవడం గర్వంకారణమన్నారు.తెలంగాణ పోలీసులు కేవలం తమ విధి నిర్వహణకే కాకుండా అనేక సామాజిక బాధ్యతలను నెరవేరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో గొప్ప రక్షణ వ్యవస్థగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దడానికి అనురాగ్‌శర్మ శ్రమించారు. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. మానవ ప్రవృత్తిలో చంచలత్వం ఉన్నంతకాలం భూమిపై శాంతి భద్రతల సమస్య ఉంటుంది. శాంతి భద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ. ఎంతో తెలివి, సమన్వయం, కొత్త ఆలోచనలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వినూత్నంగా ఆలోచించి కొత్త విధానాలు నెలకొల్పడానికి కొత్త ప్రయోగాలు చేయడానికి ఆకాశమే హద్దని తెలిపారు.

తెలంగాణ ప్రాంత చరిత్రలో ఎన్నడూ కూడా గడిచిన మూడున్నరేళ్లున్నంత ప్రశాంతంగా లేదు. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండేది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా గతంలో పోలీసు శాఖపై ఆరోపణలు ప్రధాన ఎజెండాగా ఉండేది. తెలంగాణ పోలీసులు ఆ పరిస్థితిని మార్చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరును చూసి ఓటేయండి అని కూడా అడిగాం. ఈ సందర్భం గతంలో ఎప్పడూ లేదు. తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలు పర్యవేక్షించడంలోనే కాకుండా నేరాల నియంత్రణకు చేసిన నిరంతర కృషి దేశ రక్షణకు కూడా ఉపయోగపడింది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, తెలంగాణ గ్రే హౌండ్స్ పనితీరు అద్భుతమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఇతర మంత్రులు చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగింది. అనురాగ్‌శర్మతో పాటు, కొత్త డీజీపీగా నియమితులైన మహేందర్‌రెడ్డి కృషితోనే ఇది సాధ్యమైంది. అనురాగ్‌శర్మ అనుభవాన్ని, అవగాహనా శక్తిని దృష్టిలో ఉంచుకునే పోలీసు శాఖకు, ప్రభుత్వానికి ఉపయోగపడుతారని సలహాదారుడిగా నియమించాం. కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి ఓపిక, కార్యదక్షత, లక్ష్య సిద్ధి కలిగిన అధికారి. డీజీపీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసు శాఖ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే గొప్ప పోలీసులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.