50 ఏళ్లు పాలించిన వారే..నీతులు చెప్ప‌డం సిగ్గుచేటు..కేటీఆర్‌ – Dharuvu
Breaking News
Home / SLIDER / 50 ఏళ్లు పాలించిన వారే..నీతులు చెప్ప‌డం సిగ్గుచేటు..కేటీఆర్‌

50 ఏళ్లు పాలించిన వారే..నీతులు చెప్ప‌డం సిగ్గుచేటు..కేటీఆర్‌

రాష్ర్టాన్ని యాభై ఏళ్ల ప‌రిపాలించిన వారు మౌళిక స‌దుపాయాలు బాగాలేవ‌ని త‌మ‌కు చెప్ప‌డం నీతులు చెప్ప‌డం చిత్రంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్  వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రశాసన్‌ నగర్ – తట్టీఖాన వరకు 900ఎంఎం డయా నీటి పైపులైన్, కళింగ ఫంక్షన్ హాల్ – రోడ్ నెంబర్ 12 కమాన్ వరకు 450 ఎమ్ఎండీ నీటి పైప్ లైన్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జలమండలి ఆఫీస్ ముందు ఖాళీ బిందెలతో ధర్నాలతో చేసేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామ‌ని..నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామ‌ని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామ‌ని మంత్రి వివరించారు. ప్రతి వ్యక్తికి 150 లీటర్ల మంచి నీరు అందించేలా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నామ‌న్నారు. లక్ష 50 వేల కొత్త కనెక్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కు తాగు నీటి సమస్య ఉండకూడదని సీఎం కేసీఆర్ రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని మంత్రి పున‌రుద్ఘాటించారు.

హైద్రాబాద్ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామ‌ని మంత్రి కేటీఆర్ పున‌రుద్ఘాటించారు. రైతన్నలకు కూడా 24 గంటల కరెంటు ఇస్తున్నామ‌న్నారు. 50 ఏండ్లు పరిపాలించిన వాళ్లే ఇవాళ రోడ్ల గురించి మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గ‌త పాలకులు సీవరేజ్ వ్యవస్థను పట్టించుకోలేదని.. గుర్తు చేశారు. హైదరాబాద్ లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నామ‌న్నారు. జీహెచ్ఎంసీ మీద భారం వేయకుండా మొత్తం 8వేల కోట్లకు పైగా నిధులు ప్రభుత్వమే ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ వివ‌రించారు.

బస్తీల్లో ఇండ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రతి డివిజన్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతున్నద‌ని ఆయ‌న తెలిపారు. ప్రజల సౌలభ్యం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ పైపు లైన్ నిర్మాణ పనులను వేగంగా ముగించాలని కోరారు. బంజారాభవన్ నిర్మాణం జరుగుతున్నదని పేర్కొంటూ ప్రజల కోసం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామ‌ని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ దత్తాత్రేయ, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండి దాన కిషోర్, పలువురు కార్పొరేటర్లు హాజ‌ర‌య్యారు.