శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..? – Dharuvu
Breaking News
Home / BAKTHI / శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..?

శివరాత్రి ఉపవాసం ఏవిధంగా చేస్తే ఫలితం ఉంటుంది..?

శివరాత్రి నాడు ఉపవాసం ఏవిధంగా చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు? అసలు శివరాత్రినాడు తప్పని సరిగా ఉపవసించాలా..? ఉపవాసం చేయలేకపోతే ఏమైనా అరిష్టం జరుగుతుందా..? ఈ ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తుంటాయి.

మహా శివరాత్రి పర్వదినాన అతిముఖ్యమైనవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివ రాత్రి విశేషం ఏమిటంటే, శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండీ వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వ మేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం లో చెప్పబడింది.

శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతం లో జీవన్ముక్తులౌతారని స్కాంద పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వలన ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో అంటాడు.

శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!
మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!

శివరాత్రి నాడు అంటే మాఘ కృష్ణ చతుర్థినాడు ఎవరైతే శివపూజ చేస్తారో, వారు మరొకసారి తల్లి పాలను తాగ లేరని అర్థం. అంటే వారు శివపూజా ఫలం వల్ల జన్మాంతం లో శివైక్యం పొంది మళ్ళీ జన్మ ఉండదని భావం.

ఉపవాస విశిష్టత :

ఉప సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః
ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్ ||

వరాహోపనిషత్తు లో గల ఈ శ్లోకం ఉపవాసానికి అర్థాన్నిచెబుతోంది. జీవుడు పరమాత్ముని సామీప్యం లో వశించడమే ఉపవాసం. ఎటువంటి ఇతరమైన ఆలోచనలూ చేయకుండా, కేవల భాగవదారాధనే ఉపవాసం అంటే. భవిష్యపురాణం లోనూ ఇదే అభిప్రాయం చెప్పబడింది.

ఉపవాసం ఎలా చేయాలి..?

సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని చేసి, శివుని ధ్యానించాలి. అన్నం, పప్పు దినుసుల తో చేసిన పదార్థాలు తినకూడదు. సముద్రపు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని వాడాలి. పాలూ పండ్లూ తినవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆహారం మీదకి దృష్టి పెట్టకుండా భగవంతుని ధ్యానించడమే ఉపవాస లక్ష్యం.

ఆహారం మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కాబట్టి సాత్వికాహారమైన పాలు, పళ్లని స్వీకరించాలి. అన్నం పప్పులలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అరగడానికి జరిగే ప్రక్రియ వలన మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరం భుక్తాయాసం తో మందకొడిగా తయారవుతుంది. అందుకని అన్నం పప్పులు వంటి ఆహార పదార్థాలని ఉపవాస దీక్షా సమయం లో తినకూడదు.

ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఉపవాస దీక్షను చేయవలసిన నియమం లేదు. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం” అన్నారు పెద్దలు. అంటే ఎటువంటి ధర్మకార్యాలకైనా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ప్రాథమిక అవసరం.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును.

ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమున వుపవాసము ఉంటారు.
ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనో, తమ స్వంత పంటపొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారుచేస్తూ జాముకొక శివలింగం తయారుచేసి పూజిస్తారు. సుభమ్

రుద్రాభిషేకం

వేదాలలోనుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతఃకాలంలో పవిత్రస్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలందుకుంటుంది. దీనిద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్ధం.

పంచాక్షరి మంత్ర0

పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు “న” “మ” “శి” “వా” “య” (ఓం నమశ్శివాయ) నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది.

మహామృత్యుంజయ మంత్రం

ప్రధాన వ్యాసము: మహామృత్యుంజయ మంత్రం
మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం లోని ఒక మంత్రము. దీనినే “త్రయంబక మంత్రము”, “రుద్ర మంత్రము”, “మృత సంజీవని మంత్రము” అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

శివసహస్రనామస్తోత్రం

శివసహస్రనామ స్తోత్రములోని వేయి నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి.