Home / TELANGANA / కేసీఆర్.. రేపటి భారత విప్లవం.!!

కేసీఆర్.. రేపటి భారత విప్లవం.!!

దేశంలోనే భాగమైన రాష్ట్రాల రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో భాగం కాకుండా ప్రాంతీయ రాజకీయాలుగా కుదించబడటంలోనే నేటి వర్తమాన రాజకీయ విషాదం దాగివుంది. ఈ విలోమ రాజకీయ విధానం నుంచి దేశాన్ని బయటపడేసి ప్రాంతీయ రాజకీయాలను దేశీయంగా మార్చేందుకు సిఎం కేసీఆర్ చేస్తున్న కృషి భవిష్యత్తులో విప్లవాత్మకంగా మారనున్నది. ఆ దిశగా కేసీఆర్ ముందుకు తెస్తున్న సమాఖ్య రాజకీయాలు దేశ రాజకీయాలకు సరికొత్త రాజకీయ నిర్వచనాన్నివ్వనున్నయి.

భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవడం అనేది నేటి మారుతున్న ప్రపంచంలో భారత దేశం ముందున్న పెను సవాలు. ఈ సవాలును అధిగమించడానికి గత డెబ్భై యేండ్లనుంచి జాతీయ వాదం పేరుతో మనం పడుతున్న పాట్లు అన్నీ యిన్నీకావు. జాతీయ వాదం అంటే ప్రాంతీయ వాదాన్ని విస్మరించడం అనే విలోమ అనువాదాన్ని ముందుకు తేవడంలోనే సమస్యంతా యిమిడివున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు పాలన అందే విధంగా ప్రాంతీయ దృక్పథంతో పాలన కొనసాగించాల్సిన జాతీయ నాయకత్వం.. దేశీయ విశాల దృక్పథంతో తమ రాష్ట్ర పాలనను ముందుకు నడపాల్సిన ప్రాంతీయ నాయకత్వం.. నేటి వర్తమాన భారతానికి తక్షణావసరం. ఈ కోణంలోంచి చూసినపుడు రాష్ట్రాల రాజకీయాలను ప్రాంతీయ రాజకీయాలు అనడం మానాలె. ఆ పద ప్రయోగాన్ని మార్చాలె. ప్రాంతీయ పార్టీలను దేశీయ పార్టీలు అని, ఆయా రాష్ట్రాల రాజకీయాలను దేశీయ రాజకీయాలు అని గుర్తించాలె. నేషనల్ పాలిటిక్స్‌ అని ఇంగ్లీషులో అంటున్నప్పుడు.. దానికి అనువాదం దేశీయ రాజకీయాలు అవుతయిగానీ.. జాతీయ రాజకీయాలు ఎట్లయితయో ఆలోచించాల్సిన సమయమిది. యింకా చెప్పాల్నంటే.. దేశంలోనే భాగమైన రాష్ట్రాల రాజకీయాలు జాతీయ రాజకీయాల్లో భాగం కాకుండా ప్రాంతీయ రాజకీయాలుగా కుదించబడడంలోనే నేటి వర్తమాన రాజకీయ విషాదం దాగివుంది. ఈ విలోమ రాజకీయ విధానం నుంచి దేశాన్ని బయటపడేసి ప్రాంతీయ రాజకీయాలను దేశీయంగా మార్చేందుకు సిఎం కేసీఆర్ చేస్తున్న కృషి భవిష్యత్తులో విప్లవాత్మకంగా మారనున్నది. ఆయన ముందుకు తెస్తున్న దేశీయ ప్రత్యామ్నాయ రాజకీయ విధానం.. భారత దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలపడం కోసమేననే విషయాన్ని ప్రజాస్వామికవాదులంతా గమనించాలె. భారతదేశ భిన్నత్వం రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా మాత్రమే పరిరక్షింపబడుతుందనే విషయాన్ని ఢిల్లీ పాలకులు గుర్తించకపోతే మూల్యం చెల్లించక తప్పదు.

భిన్నత్వంలో ఏకత్వం అనే భావన సాంప్రదాయ సాంస్కృతిక అంశంగానే కొనసాగుతున్నదీ దేశంలో. సంస్కృతి ద్వారానే కాకుండా.. ప్రజల జీవన స్థితిగతులను ప్రభావితం చేసే రాజకీయ సాధికారత, విధాన పర నిర్ణయాధికారం, తద్వారా అధికార వికేంద్రీకరణ అనే అంశం పునాదిగా కూడా భారతీయ ఏకత్వ భావన రాష్ట్రాలకు విస్తరించాల్సిన అవసరమున్నది. ఇవాళ ఇదే అవసరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశ ప్రజలకు గుర్తుచేస్తున్నరు.

గత మూడు నాలుగు రోజులుగా దేశవ్యాప్త చర్చకు కారణమైన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనలోని అంతస్సారాన్ని మనం యీ కోణంలోంచి విశ్లేషించాల్సి వున్నది. ‘ఫెడరల్ ఫ్రంట్ ఫర్ ఫెడరల్ జస్టిస్’ అనే కేసీఆర్ నినాదం రాజకీయ నినాదం మాత్రమే కాదు, అదొక జాతీయ తాత్విక విధానం. భారత దేశ చరిత్రకున్నంత విస్తృతి కేసీఆర్ ముందుకు తెస్తున్న దేశీయ రాజకీయ విధానంలో ఇమిడివున్నది. ఇది అర్థంకావాలంటే మనం వొక్కసారి భారత దేశ రాజకీయ సాంస్కృతిక చరిత్రను పరిశీలిద్దాం.

పలు రాజ్యాలతో నిత్య యుద్ధాలతో కల్లోలిత ప్రాంతంగా కొనసాగిన బ్రిటీష్ పూర్వ భారతం.. పరాయి బ్రిటీషు పాలకుల పాలనాననంతరం వొక దేశంగా రాజకీయ సామాజిక సాం‍స్కృతిక నైసర్గిక స్వభావాన్ని సంతరించుకుని భారతదేశంగా రూపుదిద్దుకున్నది. పలు జాతుల సమిష్టి జీవన విధానానికి వేదికగా కొనసాగుతున్నది. వొక దేశంగా లేని కాలం నుంచి గణతంత్ర రాజ్యంగా కొనసాగుతున్న నేటి వరకు భారతదేశం సంయుక్త రాజ్యాల/రాష్ట్రాల పొలిటికల్ రూపం. రాష్ట్రాలన్నీ దేశంలో అంతర్భాగం అనేది ఎంత వాస్తవమో దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతీ రాష్ట్రానికీ వొక జాతికున్నంత ప్రత్యేకతలున్నయనేదీ అంతే వాస్తవం. దేశంలోని ప్రత్యేక రాష్ట్రాలన్నీ ప్రత్యేక జాతులు అనే చెప్పవచ్చు. దేశంలోని ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేక భాషా సాంస్కృతిక జీవన విధానంతో వేల సంవత్సరాల చరిత్రను కొనసాగిస్తున్నవి. ఈ నేపథ్యంలో భారత దేశ ప్రజల జీవన విధానం స్థితిగతులు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందడంలేదనే వాస్తవం డెబ్బయేండ్ల స్వతంత్ర భారతాన్ని పట్టిపీడిస్తున్న వర్తమాన రాజకీయాంశం. దేశంలోని రాజకీయ విధానాలను, చట్టాలు రాజ్యాంగ సూత్రాలను, మారుతున్న సమాజానికి అనుగుణంగా చక్కదిద్దుకోకుండా రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించడం అనేది.. గొంగట్లే అన్నం తినుకుంటూ బొచ్చు యేరుకోవడమనే సామెతను యాది చేస్తున్నది.

అంబేద్కర్ మహాశయుడు అందించిన రాజ్యాంగ స్ఫూర్తిని యీ నాటికీ వంటపట్టించుకోలేని కేంద్ర పాలకులకు.. ఈ దేశం ఈనాటికీ అర్థమే కాలేదంటే అతిశయోక్తి కాదు. ప్రజలను వోట్లు కాసే చెట్లు మాదిరి పరిగణించి తదనుగుణంగా మాత్రమే పాలనా విధానాలు రూపొందిస్తుండడం ఈ దేశ రాజకీయ దౌర్భాగ్యం. నిచ్చెన మెట్ల కుల సమాజంలో వందకు తొంభై శాతంగా వున్న సబ్బండ జాతులను కేంద్రంగా చేసుకుని వారిని మరింతగా సంఘటితపరిచి వారి జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పులు తెచ్చే దిశగా పాలన సాగాలె. కానీ వారిని కులాలవారిగా మతాలవారిగా విడగొట్టి ఐదేండ్లకోపాలి వోట్లు పిండుకోని వదిలేయడానికే పరిమితమైంది.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ప్రజలకు పదే పదే వో మాట చెప్తుండే. తెలంగాణలో పాలన సమైక్య రాష్ట్రంలో మాదిరి జరిగితే కుదురదు. నాటి పాలకులు వారి విధానాలు వేరు. నేటి నవ తెలంగాణ వేరు, వారి ఆకాంక్షలు వేరు. ప్రజా ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా వుండాలె పాలన అని చెప్పేవారు. ఇదే సూత్రం నేటి భారత దేశానికీ వర్తిస్తది. పరాయి పాలకుల నుంచి విముక్తి పొంది సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా నిలవడ్డ ఇండియా పోతపోసినట్టుండే ఏకశిలా విగ్రహం కాదు. అది రంగు రంగు రాల్లను పేర్చినట్టు పేర్చిన శిల్పం మాదిరి పలు రకాల జాతుల కలయిక. .

అమెరికాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్‌ అమెరికా అన్నట్టు ఇండియాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా (ఇండియా సంయుక్త రాష్ట్రాలు)గా గుర్తించవలసిన అక్కెరను కేసీఆర్ ఫెడరల్ ఫ్రంటు నినాదం మనముందుకు తెస్తున్నది. కేంద్రం గుప్పిట్లో పెట్టుకున్న రాజకీయ అధికార వికేంద్రీకరణ రాష్ట్రాలకు చేర్చాల్సిన అవసరాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడమే కేసీఆర్ ముఖ్యోద్దేశం. రాష్ట్రాలకు అధికారాలను అందిస్తే తమ పెత్తనం యేడ చేజారిపోతుందోననే ధ్యాసే తప్ప రాష్ట్రాలుగా నివసిస్తున్న దేశ ప్రజలకు అభివృద్ధిని గడప గడపకూ అందించే సోయిని జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ బీజేపీలు ప్రదర్శిస్తలేవు. రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల్లోంచి దాదాపు నలభై శాతం ఆదాయం కేంద్రమే గుంజుకుంటున్న నేపథ్యంలో, రాష్ట్రాల నుంచి కప్పం కట్టిచ్చుకున్నట్టుగా కాకుండా, దేశం కోసం రాష్ట్రాల బాధ్యతగా పరిగణించాల్సిన అవసరమున్నది.

సైన్యం, దేశ రక్షణ, అంతర్జాతీయ వ్యవహారాలు, కరెన్సీ, జాతీయ రహదారులు తదితర జాతీయ విధానాలు కేంద్రం వద్ద వుంచుకుని, ప్రజలను క్షేత్రస్థాయిలో నేరుగా ప్రభావితం చేసే విద్య, వైద్యం, రవాణా, తాగు సాగు నీరు… తదితర అంశాలకు సంబంధించి రాష్ట్రాలకు పూర్తిస్థాయి బాధ్యత అప్పగించాల్సిన అవసరమున్నదనేది కేసీఆర్ ఫెడరల్ జస్టిస్లోని కీలకాంశం.

అదే సందర్భంలో రిజర్వేషన్ల అమలు విషయంలో ఆయా రాష్ట్రాలకే అధికారం వుండాలనే నినాదం వూపందుకుంటున్నది. దేశం కులాల సమాజం. తొంభై శాతం జనాభా ఆర్థిక రాజకీయ రంగాల్లో ఈనాటికీ వెనకబడివుండడంలోని డొల్లతనాన్ని కేసీఆర్ ప్రశ్నించడం కొంతమంది జాతీయ పార్టీల నేతలకు రుచించకపోవచ్చుకనీ.. దానికి సమాధానం దోలాడుకోవాలసిన అక్కెరున్నది. ఓట్లు జమచేయడమే లక్ష్యంగా మూస పద్ధతిన కొనసాగుతున్న రిజర్వేషన్ల వ్యవస్థను దేశ ప్రజల జీవన విధానాన్ని గుణాత్మకంగా మార్చే దిశగా మళ్ళించాలనేదే కేసీఆర్ లక్ష్యంగా మనం అర్థం చేసుకోవాల్సివుంది.

రాజ్యాంగ హక్కుగా వున్న రిజర్వేషన్లకు యాభై శాతం అంటూ క్యాప్ పెట్టడం యేంటనేది తొంభైశాతంగా వున్న బహుజన సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్న అంశం. యెవరెంతో వారికంత… అనేది సహజ న్యాయం కూడా. అయితే ఈ సహజ న్యాయాన్ని దేశ ప్రజలకు అందించడానికి ఢిల్లీ గద్దెనేలుతున్న కాంగ్రేస్ బిజెపీ పార్టీల నేతలకు వొచ్చిన కష్టం యేంది? వొక్కో రాష్ట్రంలో వొక్కో కులం అధిక జనాభాను కలిగి వుంటది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకోని వెనకబడిన వర్గాలను విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కల్పించాలని ఆయా రాష్ట్రాలు అనుకోవడం తప్పెట్లయితది?
అదీకాక.. తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో యాభైశాతం మించి రిజర్వేషన్లు వుండడానికి అంగీకరించినప్పుడు తెలంగాణలో వున్న బహుజన వర్గాలను బాగుచేసుకునేందుకు ఆ రాష్ర్ట ప్రభుత్వానికి అవకాశం ఎందుకు వుండదు? వొకే రాజ్యంగ పరిధిలో వొకే దేశంలోని చట్టం రాష్ట్రానికోతీరుగ అమలయితదా? ఇవీ.. రాజనీతిజ్ఞుడు కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలు దేశ సామాజిక రాజకీయ రంగంలో కుదుపుకు కారణమైనయి. రిజర్వేషన్లే వద్దు, వున్నవాటిని రద్దు చేయాలె.. అని ఆధిపత్య కుల వర్గాలు చేస్తున్న డిమాండును తలదన్నే పద్ధతిలో, యెవలెంతో వాల్లకు అంత.. అనే విప్లవాత్మక పిలుపు ఇవాల దేశ రాజకీయాలను గుణాత్మకంగా మార్చనున్నది. అటు రాష్ట్రాలకు మరిన్ని హక్కులు కల్పించడం, రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు పరుచుకునే వెసులుబాటును కల్పించడంతో పాటు, డెబ్భై ఏండ్లుగా దేశంలో నెలకొన్న రాజకీయ స్తబ్ధతను బద్దలుకొట్టి.. దేశానికి వో దిశ నిర్దేశించేందుకు తెలంగాణ బిడ్డగా కేసీఆర్ వేస్తున్న ముందడుగు… రేపటి భారత సామాజిక రాజకీయ విప్లవం.

  • సోర్స్ :  రమేశ్ హజారి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat