Breaking News
Home / EDITORIAL / పదునెక్కుతున్న బాణం..!!

పదునెక్కుతున్న బాణం..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస బహిరంగ సభలతో యువనేత, రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్రకు దీటుగా సాగుతున్న ‘జనహిత ప్రగతి సభ’ల్లో ఆయన ప్రసంగాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఇటు ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూ, అటు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న తీరు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను ఆకట్టుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘జనహిత ప్రగతి సభ’ల జోరు మరింత పెరిగింది.

ఇటీవల వరుస గా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మంత్రి కేటీఆర్ వరుస సభ ల్లో పాల్గొంటూ రాజకీయ వేడిని పుట్టిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం ఏప్రిల్ 6న తన చెల్లెలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్‌లో నుండి ‘జనహిత ప్రగ తి సభ’లకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఆయా జిల్లాల్లో పూర్తయిన భారీ అభివృద్ధి పనుల కు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు, ప్రభుత్వ పనితీరును వివరించాలనేది దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సభల్లో జిల్లా మంత్రులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొంటు న్నప్పటికీ మంత్రి కేటీఆర్ ప్రధానఆకర్షణగా నిలుస్తున్నారు. తద్వారా పార్టీలో ఆయనకు పెరిగిన ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే తెలంగాణలో అన్ని జిల్లాలను అనేకమార్లు చుట్టివచ్చిన కేటీఆర్ , దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ సభలు నిర్వహించేలా ప్రణాళికలు వేసుకున్నారు.

ఒకవైపు కాంగ్రెస్ బస్సు యాత్ర సాగుతున్న సమయంలో జరుగుతున్న తాజా బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ విసురతున్న సవాళ్ళు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. మిర్యాలగూడెం సభలో వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధమని, అందుకు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిద్ధమా? అని మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెడుతూ సవాలు విసరడం సాహసోపేతమైన చర్య అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కూడా ఇలాంటి సవాలే విసిరడమే కాకుండా అన్నీ తానై టిఆర్‌ఎస్‌ను ఊహించని మెజారిటీతో గెలిపించి కేటీఆర్ తన సత్తా చాటుకున్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తరువాత అత్యధిక శాఖలను చూస్తున్న మంత్రిగా ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉన్న కేటీఆర్ కు భవిష్యత్తు నాయకునిగా ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. దీనికి తోడు అన్ని శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, అను నిత్యం విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుతూ, ఇటు సంక్షేమ కార్యక్రమాలలో బిజీ బిజీగా ఉండే కేటీఆర్ ప్రజలతో సంబంధాలను సాగించే విషయంలో ఎక్కడా తగ్గ లేదు. ఒకవైపు ట్విట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటుండడమే కాకుండా, ఎవరైనా వైద్య సాయం కోసం ట్వీట్ చేస్తే చాలు సాయం అందుతుందనే భరోసాను అందరికీ కల్పించారు. దీనికి తోడుగా జిల్లాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ‘జనహిత ప్రగతి సభ’లను వేదికగా వాడుకుంటున్నారు. నిర్ణీత సమయం కంటే మంత్రి కేటీఆర్ రాక ఆలస్యమైనప్పటికీ ప్రజలు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. మణుగూరులో 43 డిగ్రీల ఎండలో జరిగిన సభకు పెద్ద ఎత్తున మహిళలలు తరలిరావడమే కాకుండా, ఆద్యంతం కేటీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు.