అత్యంత ఘోర ప్రమాదం సైనిక విమానం కూలి..257 మంది సైనికులు మృతి – Dharuvu
Breaking News
Home / CRIME / అత్యంత ఘోర ప్రమాదం సైనిక విమానం కూలి..257 మంది సైనికులు మృతి

అత్యంత ఘోర ప్రమాదం సైనిక విమానం కూలి..257 మంది సైనికులు మృతి

అల్జీరియాలో సైనిక విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం ఇలిషిన్‌ – 76 విమానం ఉత్తర అల్జీరియాలోని బుఫారిక్‌ సైనిక స్థావరం నుండి టేకాఫ్‌ అయిన వెంటనే విమానాశ్రయానికి సమీపంలో ఒక పొలంలో సైనిక సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. . అల్జీర్స్‌ సమీపంలోని బౌఫారిక్‌‌ విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోగా 257 మంది చనిపోయారని స్థానిక టీవీ వెల్లడించింది. అయితే మృతుల సంఖ్యపై అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిన చోట పెద్ద ఎత్తున దట్టమైన నల్లని పొగలు ఎగిసిపడినట్లు స్థానిక టీవీ దృశ్యాలను ప్రసారం చేసింది. అత్యవసర సేవల సిబ్బంది, భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

విమానం బౌఫారిక్‌‌ నుంచి బెచర్‌ నగరంలోని వైమానిక స్థావరానికి బయల్దేరగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న వారు సైనికులని దేశ రక్షణ శాఖ స్పష్టంచేసింది. మరణించిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేసింది. వంద మందకి పైగా మరణించారని, ప్రస్తుత పరిస్థితుల్లో కచ్చితమైన సంఖ్య చెప్పలేమని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సైనిక రవాణాశాఖు చెందిన ఈ విమానం వ్యవసాయ భూముల్లో పడిపోయిందని, అయితే ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని రక్షణ శాఖ తెలిపింది.