అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా..! – Dharuvu
Breaking News
Home / EDITORIAL / అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా..!

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా..!

ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం నిండా నాలుగేళ్లు లేదు. మిగిలిన 13 ఏళ్ల మాటేమిటి? అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?.అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ప్రాంగణంలోకి ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి సిరికొండ మధుసూదనాచారి (తెలంగాణ శాసనసభ ప్రస్తుత స్పీకర్‌) హడావుడిగా కిందికి దిగారు. ఆటోవాలాకు డబ్బులిచ్చిన ఆయన పరుగులాంటి నడకతో భవన్‌ లోపలికి వెళ్తున్నారు. చారీ సాబ్‌ చేతిలో ఏవో కొన్ని పేపర్లు ఉన్నాయి.

విధి నిర్వహణలో భాగంగా నేను, అతి కొద్ది మంది జర్నలిస్టులు ఆ సమయాన అక్కడే ఉన్నాం. ‘‘ఏంటి సార్‌! ఏదైనా విశేషమా?’’ అని మేము అడిగేలోపే ఆయన..‘‘ఇంపార్టెంట్‌ న్యూస్‌ ఉంది. మీడియా రూమ్‌లో రెడీగా ఉండండి’’ అంటూ ప్రతి రోజు భవన్‌లో తాను కూర్చునే గదిలోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత చారీ సాబ్‌ మీడియా రూమ్‌లోకి వచ్చి..‘టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి కె.చంద్రశేఖర్‌రావు రాజీనామా’ చేసిన విషయాన్ని ప్రకటించారు. 2009 అసెంబ్లీ, లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఘోర పరాభవం తదుపరి టీఆర్‌ఎస్‌లోని కొందరు నాయకులు తిరగబడి తనపై, తన కుటుంబ సభ్యులపైనా చేసిన విమర్శలకు కేసీఆర్‌ మనస్థాపం చెందటమే రాజీనామా నిర్ణయానికి కారణమని వెల్లడించారు. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లో టీఆర్‌ఎస్‌ యంత్రాంగం యావత్తు ఒత్తిడి తీసుకురావటం, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ చొరవ తీసుకొని సర్దిచెప్పటం వల్ల కేసీఆర్‌ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఇది తొమ్మిదేళ్ల కిందటి ముచ్చట.

కాలక్రమంలో అదే కేసీఆర్‌ సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమాన్ని తీరానికి చేర్చటంలో సఫలీకృతమయ్యారు. 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించటమేకాక, ఒంటి చేత్తో టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చారు. నూతన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం, బీజేపీ – కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో పీపుల్స్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది నడుస్తున్న చరిత్ర. ఈ రెండు ఉదంతాలు టీఆర్‌ఎస్‌ ఉత్థానపతనాలను కళ్లకు కడుతాయి.

ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 2001లో పురుడుపోసుకున్న ఆ పార్టీకి చెందిన 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం వయసు నిండా నాలుగేళ్లు కూడా లేదు. మరి మిగిలిన 13 ఏళ్ల మాటేమిటి? ఎన్నికల్లో గెలుపు–ఓటములు, ఎత్తులు–జిత్తులతో సంబంధం లేకుండా, అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఆశయంతో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించే నాటికి ఆయన వద్ద ఉన్న ఆర్థిక వనరులు చాలా పరిమితం.

ఆ రోజుల్లో కాన్వాయ్‌ బయటి తీస్తే లక్ష రూపాయల పైమాటే. భారీ బహిరంగ సభ నిర్వహణను పూనుకుంటే కోట్ల రూపాయల వ్యవహారం. గడప దాటి కాలు బయట పెట్టాలంటే, ఏదైనా పర్యటనకు వెళ్లాలంటే, ఖాళీగా ఉన్న జేబులను నింపుకోక తప్పని స్థితి. ఈ పరిస్థితుల్లో ఎన్నో కార్యక్రమాలను అనివార్య కారణాల పేరిట రద్దు చేసుకున్న కేసీఆర్‌, ఆయన పిల్లలు పడ్డ వేదన ఇప్పుడు ఎవరికి కావాలి? మనకు ఒక నెల జీతం ఆలస్యమైతేనే ఇంట్లోని పొయ్యిలో పిల్లి లేవటం కష్టమవుతుంది. అలాంటిది కేసీఆర్‌ నివాసంలో పార్టీ పెట్టిన కొత్తలో నుంచి నిత్య అన్న సంతర్పణే. ఉద్యమ సమయంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా తినే వేళకు ఎవరు? ఎంత మంది? ఉన్నప్పటికీ, ఆయన సతీమణి శోభ భోజన ఏర్పాట్లు చేయకుండా లేరు. వారి ఇంట్లో రోజూ హీనపక్షం యాభై.. నూరు మంది చేయి కడగకుండా వెళ్లింది లేదు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా గ్యాస్‌ స్టౌ మీది నుంచి దిగే గిన్నెలు, కడిగే కంచాలన్నట్లుగానే కేసీఆర్‌ ఇంటి వాతావరణం ఉండేది. పెట్టిన చేతులు మర్చిపోవచ్చు. తిన్న మనుషులు గుర్తు పెట్టుకోకపోతేనే సమస్య. అందుకే కేసీఆర్‌ వైఖరితో విభేదించే వారు కూడా ఆయన అతిథ్యానికి మురిసిపోయి, మెచ్చుకోకుండా ఉండలేరు.
2009 తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు సైతం టీఆర్‌ఎస్‌ అధినాయకత్వాన్ని ఆర్థిక కష్టాలు నీడలా వెన్నాడాయి. కేసులు, ఇతరత్రా పనులపై ఢిల్లీకి వెళ్లటానికి విమాన టికెట్ల భారం భరించలేక చాలా మంది పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు రైలు ప్రయాణాన్ని ఎంచుకునే వారు. విమానాల్లో ఖరీదైన బిజినెస్‌ క్లాస్‌లో కాకుండా, ఎకనామిక్‌ క్లాస్‌లో ప్రయా ణించారు. ఇలాగే ఒకసారి టి. హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ (ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు) ఢిల్లీకి ఎకనామిక్‌ క్లాస్‌లో వెళ్తున్నప్పుడు, అదే విమానంలోని తోటి ప్రయాణికులు చుట్టుముట్టి.. ‘‘మీరేంటి అన్నా.. ఎకనామిక్‌ క్లాస్‌లో రావటం ఏమిటన్నా?’’ అని వేసిన ప్రశ్నలకు నాడు వారి మోము మీద చిరునవ్వు తప్ప, నోటి నుంచి సమాధానం లేదు.

అన్నం తిన్నారో.. అటుకులు బుక్కారో తెలియదు కానీ, వేలాది సభలు, సమావేశాలను గులాబీ దళపతి సక్సెస్‌ చేయటాన్ని ఎవరు కాదనగలరు? తినే వేళ కేసీఆర్‌ వద్దకు వెళ్లి కడుపు మాడ్చుకొని బయటికి వచ్చామని ఎవరైనా చెప్పగలరా? చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పంటి బిగువన బాధను భరించారే తప్ప, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారనటానికి సాక్ష్యాలు ఉన్నాయా?

టీఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ అనే లక్ష్యం చుట్టూనే పరిభ్రమించిన కేసీఆర్‌ మార్గమధ్యంలో తనకు ఆర్థికంగా అండదండలు అందించిన వారి వద్ద చేసిన బాసలన్నింటినీ ఆ తర్వాత పూర్తిగా నిలబెట్టుకోకపోయి ఉండవచ్చు. కానీ డబ్బు సాయం చేసిన వారు, మూడున్నర కోట్ల మంది భూమి పుత్రులు కేసీఆర్‌ సాకారం చేసిన తెలంగాణ అనే స్వప్నానికి వెల కట్టగలరా?

ఒకప్పుడు విమర్శలకు కలత చెంది పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డ కేసీఆర్‌ బుజ్జగింపుల అనంతరం తిరిగి పార్టీ సారథ్యం స్వీకరిస్తారనేది నాడు ఊహించిందే. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎదుర్కొంటున్న విమర్శలనే మెట్లుగా మలుచుకొని జాతీయ రాజకీయాల దిక్కు పయనిస్తుండటం మాత్రం వ్యూహాత్మకమే.

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ మాటలు, చేతలకు ప్రజామోదం ఏ స్థాయిలో ఉంది? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుండగా, ఈ మధ్య మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసినప్పుడు ఆయన చెప్పిన ఓ సంఘటన ఆలోచింపజేసింది.

ఇటీవల మంత్రి జూపల్లి తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్‌ పరిధిలోని కోడేరు మండలం జనుంపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవానికి గ్రామ పెద్దలిద్దరినీ పిలిచి కొబ్బరి కాయ కొట్టాల్సిందిగా కోరారు. అందులో ఒకరు టీడీపీలో, మరొకరు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. ఉండబట్టలేక జూపల్లి వారితో.. ‘‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు, ఇంకా ఆ పార్టీల్లో ఎంత కాలం ఉంటారు?’’ అని ప్రశ్నిస్తే, నిజమేననే సమాధానం వచ్చింది. మళ్లీ జూపల్లినే కలగజేసుకొని.. ‘‘మరి గులాబీ కండువాలను కప్పుకుంటే, అయిపోతుంది కదా!’’ అని అన్నారు. బదులుగా వారు.. ‘‘కప్పంగ ఎవరు వద్దంటున్నారు సార్‌!’’ అనటంతో ఒక్కక్షణం ఆశ్చర్యపోయిన జూపల్లి వెంటనే తేరుకొని వారి మెడలో గులాబీ కండువాలు కప్పారు. మంత్రి జూపల్లి చెప్పినట్టు.. ఎసరు వంచిన అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా?

(ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినం సందర్భంగా కాపీ పోస్టు @సోర్స్ :
మెండు శ్రీనివాస్‌ )