మోడీది డ‌బ్బులు లాక్కునే సిద్ధాంతం…కేసీఆర్‌ది ఉత్త‌మ పాల‌న‌..! – Dharuvu
Home / EDITORIAL / మోడీది డ‌బ్బులు లాక్కునే సిద్ధాంతం…కేసీఆర్‌ది ఉత్త‌మ పాల‌న‌..!

మోడీది డ‌బ్బులు లాక్కునే సిద్ధాంతం…కేసీఆర్‌ది ఉత్త‌మ పాల‌న‌..!

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అన్ని వ‌ర్గాల అభివృద్ధి అక్ష్యాలుగా బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 70 ఏండ్ల పాలనలో ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ రైతుబంధు రూపంలో చేస్తున్నారని కొనియాడారు.రామరాజ్యంలో కూడా రైతులు భూమి శిస్తు కట్టారని, కానీ తెలంగాణ ప్రభుత్వ పాలనలో రైతులకే తిరిగి పైసలిచ్చే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రైతుబంధు పథకంతో దేశవ్యాప్తంగా సరికొత్త హరిత విప్లవానికి తెలంగాణ నాంది పలికిందని వివ‌రించారు. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని నాలుగుకాలాలపాటు కాపాడుకుంటే మంచి ఆలోచనలతో మనం ముందుకు పోతామని, అందుకు ప్రజలు ఆశీర్వదించి అండగా నిలువాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట, రుద్రంగి, తంగళ్లపల్లి మండల కేంద్రాలలో ఆదివారం నిర్వహించిన రైతుబంధు కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్.. రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుబంధు పథకాన్ని అందరికీ వర్తింపజేస్తున్నామని, ఈ నెల 17 తర్వాత గల్ఫ్ కుటుంబాలకు చెక్కులు అందజేస్తామని చెప్పారు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి, రైతు జీవితం అనుభవించిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే పాలన మంచిగుంటుందనడానికి ఇదే నిదర్శనమన్నారు .దేశంలో వస్తువులను తయారుచేసినవారే వాటి ధర నిర్ణయిస్తారని, దురదృష్టవశాత్తు రైతులకు తాము పండించిన పంటకు ధర నిర్ణయించుకునే అధికారం లేకపోవడం బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర నిర్ణయించాల్సింది కేంద్రమని, అది మన చేతిలో ఉంటే సీఎం కేసీఆర్ ఎప్పుడో అమలుచేసేవారన్నారు.ప్రధాని నరేంద్రమోడీ పాల‌న‌పై ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ పంచ్ వేశారు.

మోడీ హయాంలో ప్రజలకు బ్యాంకులపై విశ్వాసం పోయిందని కేటీఆర్ విమర్శించారు. నగదు కొరత కారణంగా డబ్బుల కోసం ప్రజలు బ్యాంకుల చట్టూ తిరిగి తిరిగి బేజారవుతున్నారని అన్నారు. అక్కాచెల్లెండ్లు దాచుకున్న డబ్బును సైతం మోడీ లాక్కున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కానీ త‌మ ప్ర‌భుత్వం రైతుల‌కే చెక్కులు అందిస్తోంద‌ని కేటీఆర్ తెలిపారు. రైతుబంధు పథకంలో చెక్కులిచ్చి చేతులు దులిపేసుకోవడం కాదని, నాలుగువేల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో ముందస్తుగా డిపాజిట్లు చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు.