గోదావరి నదిలో 60 అడుగుల లోతులో లాంచీ.. అందులోనే మృతదేహాలు..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / గోదావరి నదిలో 60 అడుగుల లోతులో లాంచీ.. అందులోనే మృతదేహాలు..!

గోదావరి నదిలో 60 అడుగుల లోతులో లాంచీ.. అందులోనే మృతదేహాలు..!

గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.కాగా దుర్ఘటన జరిగిన ప్రదేశం రెండు కొండల మధ్య ఉండటం.. ఇసుకలో ఇరుక్కుని ఉండటంతో లాంచీని బయటకు తీయటానికి ఆలస్యం అవుతుంది.60 అడుగుల లోతులో ఉన్న బోటులోనే మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు.

అయితే ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా నిర్థారించలేదు. కనీసం 40 మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా దేవీపట్నం, పోలవరం, రంపచోడవరం గ్రామాలకు చెందినవారు. రాత్రి సమయంలో భారీ వర్షం, ఈదురుగాలులు రావటంతో అందరూ బోటు లోపలికి వెళ్లారు. గాలుల నుంచి రక్షణ కోసం బోటు అద్దాలు మూసివేశారు.ఆ తర్వాత ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు బోటు తిరగబడింది. బోటు పైన కూర్చున్న 15 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. లోపల ఉన్న 40 మంది జలసమాధి అయ్యారు. బోటులో ఉన్న సిమెంట్ బస్తాలు తడవకుండా ఉండటం కోసం బోటు నడిపే వ్యక్తి తీసుకున్న అతి ఉత్సాహం.. ఈ ప్రమాదం జరగటానికి కారణంగా తెలుస్తోంది. . విశాఖ నుంచి నేవీ ప్రత్యేక సహాయక బృందంతో పాటు బోటు మునిగిన ప్రాంతం వద్ద గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నేవల్‌ డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు మూడు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.