Breaking News
Home / BUSINESS / భారీగా తగ్గిన బంగారం ధరలు..ఏంతో మీకు తెలుసా..?

భారీగా తగ్గిన బంగారం ధరలు..ఏంతో మీకు తెలుసా..?

బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్‌ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్‌ మార్కెట్‌లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 రూపాయలు తగ్గి 40వేలకు కింద రూ.39,200గా నమోదైంది. వెండి కూడా పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ క్షీణించింది.

గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. దీంతో సెంటిమెంట్‌ బలహీనపడిందని బులియన్‌ ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ తన వడ్డీరేట్లను కొనసాగింపుగా పెంచనున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో, ఈ విలువైన మెటల్‌కు డిమాండ్‌ తగ్గుతోంది. గ్లోబల్‌గా ఒక్క ఔన్స్‌కు బంగారం ధర 0.32 శాతం క్షీణించి 1,223.30 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.84 శాతం తగ్గి, 15.41 డాలర్లుగా ఉంది. ఇక దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 250 రూపాయల చొప్పున తగ్గి, రూ.30,800గా, రూ.30,650గా రికార్డయ్యాయి. నిన్న కూడా బంగారం ధరలు 100 రూపాయలు తగ్గాయి.