Home / SLIDER / పాతబస్తీ ప్రజలకు మంత్రి కడియం శ్రీహరి శుభవార్త

పాతబస్తీ ప్రజలకు మంత్రి కడియం శ్రీహరి శుభవార్త

పాతబస్తీలోని ఫలక్ నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాన్ని మోడల్ క్యాంపస్ గా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఫలక్ నుమా ప్రాంగణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే అక్భరుద్దీన్ తో కలిసి నేడు తనిఖీ చేశారు. విద్యార్థినిలకు కెమెస్ట్రీ పాఠాలు చెప్పారు. ఫలక్ నుమాలో తెలుగు మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉర్ధూ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉర్ధూమీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం ఒకే ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా మంజూరు కావడంతో డిగ్రీ తరగతులు నడపడానికి కావల్సిన వసతులు ఏర్పాటు చేయడంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే అక్భరుద్దీన్ లు అధికారులతో చర్చించారు.

ఫలక్ నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల నుంచి జూనియర్ కాలేజీ వరకు తెలుగు, ఉర్దూ మీడియాలలో దాదాపు ఐదు నుంచి ఆరువేల విద్యార్థులు చదువుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే ఇక్కడ విశాలమైన స్థలమున్నప్పటికీ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల భవనాలు, వసతులు విద్యార్థుల అవసరాలకనుగుణంగా లేవన్నారు. ఇక్కడున్న ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలు, తెలుగు మీడియం పాఠశాల, బాలికల పాఠశాల, ఉన్నత విద్యా పాఠశాలలను పూర్తిగా పునర్వవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. మూడు కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజీ, ఐదు కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజీ భవనాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా భవనాలన్నింటిని కూడా పున: వ్యవస్థీకరించడం కోసం 15 రోజుల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తున్నారని, దీనిలో భాగంగా ఒకే ప్రాంగణంలో కేజీ టు పీజీ అమలు కానున్న తొలి క్యాంపస్ ఫలక్ నుమా అవుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఏడాదిలోగా కొత్త భవనాలు నిర్మించి, ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ఇటీవల బదిలీల వల్ల కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్ల కొరత ఏర్పడిందని, విద్యా వాలంటీర్లు, గెస్టు లెక్చరర్లతో ఈ కొరత లేకుండా చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మొత్తం ఉపాధ్యాయులు 75వేల మందిలో బదిలీల ప్రక్రియలో 40,000 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని చెప్పారు. దీనివల్ల కొన్ని చోట్ల ఉపాధ్యాయులు కొరత ఏర్పడిందన్నారు. జూలై 31వ తేదీ నాటికి ప్రతి కాలేజీ, పాఠశాలలో విద్యావాలంటీర్లు, గెస్ట్ లెక్చరర్ల ద్వారా ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ కుమార్, హైదరాబాద్ డీఈవో వెంకటనర్సమ్మ, ఆర్డీవో చంద్రకళ, విద్యాశాఖ చీఫ్ ఇంజనీర్ మల్లేషం ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat