Breaking News
Home / ANDHRAPRADESH / కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టినదే తెలుగుదేశంపార్టీ..అలాంటిది ఇప్పుడు..!

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టినదే తెలుగుదేశంపార్టీ..అలాంటిది ఇప్పుడు..!

తెలంగాణ పాలిట దుష్టశక్తులు మళ్లీ ఒక్కచోటుకు చేరుతున్నాయి! త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేని అల్పబుద్ధి నేతలు.. అధికార యావతో తెలంగాణను మళ్లీ దగా చేసేందుకు కూటమి కడుతున్నారు! సీఎం కేసీఆర్ ముందస్తు ప్రకటనతో పుట్టలు పగులగొట్టుకుని బయటపడుతున్న విషనాగులు.. తెలంగాణ తరిమేసిన ఆంధ్రపాలకుల పంచన చేరి.. బంగారు భవితవ్యంపై బుసలు కొడుతున్నాయి!బరితెగింపులకు కాంగ్రెస్ పార్టీ కొత్త అర్థాన్ని చెప్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు. అధికారంకోసం ఎంతదాకా అయినా వెళ్లే కాంగ్రెస్.. ఈసారి తెలంగాణ వ్యతిరేకులతోనే జట్టుకట్టేందుకు తహతహలాడుతున్నదనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న టీడీపీతో.. ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటును అణువుణువునా వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమవుతున్నదనే సంకేతాలు బలంగానే వెలువడుతున్నాయి. మరోవైపు కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను మార్చే ప్రయత్నాలకు అడ్డుపడుతున్న తెలంగాణ జనసమితి, సీపీఐ, వందల బలిదానాల్లోనూ తెలంగాణ ఏర్పాటుకు ససేమిరా అన్న సీపీఎం, తెలంగాణ ఆనుపానులు తెలియని జనసేన వంటి పార్టీలతో కూడా చర్చలు జరుపుతున్నదని సమాచారం. నిజానికి తెలంగాణ ఆవిర్భావంతోనే ఈ గడ్డపై పరాయి పార్టీలకు స్థానం లేకుండా పోయింది. అదే క్రమంలో టీడీపీ ఆంధ్రకు దుకాణం మార్చుకున్నది. కానీ.. తెలంగాణ వ్యతిరేక పార్టీకి మళ్లీ ఈ గడ్డపై జీవం పోసేందుకు మరో తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక పార్టీ ప్రయత్నిస్తుండటమే ఇక్కడ ఆశ్చర్యకర అంశం! తెలంగాణ వ్యతిరేక శక్తులన్నింటినీ పోగుచేస్తున్న కాంగ్రెస్.. తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నదనే ప్రశ్న తలెత్తుతున్నది. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు, మరో ధ్వంసరచనకే కాంగ్రెస్ అనైతిక పొత్తులకు తెర తీస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ స్వార్థపూరిత చర్యలతో యావత్ తెలంగాణ విస్మయం చెందుతున్నది. ఒకరు ప్రజాసంక్షేమానికి తపిస్తుంటే.. మరొకరు అధికారకాంక్షతో అనైతిక పొత్తులకు సిద్ధమవుతున్న తీరుతో కలవరపడుతున్నది. తెలంగాణ ప్రజల గురించి, వారి కష్టాల గురించి ఏనాడూ మాట్లాడని చంద్రబాబు.. ఇప్పుడు ఏ ఉద్దేశాలతో మళ్లీ తెలంగాణలో అడుగుపెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశంపార్టీ.. ఏ నైతికతతో అదే కాంగ్రెస్‌తో అంటకాగేందుకు సిద్ధమవుతున్నదో చెప్పాలని పలువురు ఉద్యమకారులు నిలదీస్తున్నారు.