Breaking News
Home / 18+ / సింగిడిలా సిరిసిల్ల…బతుకమ్మ పండుగ చీరలతో ఇంద్రధనుస్సు వలే మెరిసిపోతోన్న సిరిశాలపై ప్రత్యేక కథనం. 

సింగిడిలా సిరిసిల్ల…బతుకమ్మ పండుగ చీరలతో ఇంద్రధనుస్సు వలే మెరిసిపోతోన్న సిరిశాలపై ప్రత్యేక కథనం. 

“రాష్ట్ర ఏర్పాటు వల్ల ఏమైందీ?” అంటే ఉరిశాలగా మారిన సిరిసిల్లకు భద్రత దొరికింది. పనికి ఎడాది పొడవునా గ్యారంటీ లభించింది. ముఖ్యంగా, పండుగా పబ్బం మరచిపోయిన ఇక్కడి పరిశ్రమ రెండోసారి బతుకమ్మ చీరల పనిలో నిమగ్నమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తీరొక్క రంగుల బతుకమ్మ చీరలతో నేడు సిరిసిల్ల సింగిడిలా మెరిసిపోతున్నది. అవును ప్రస్తుతం సిరిసిల్ల పండుగ వాతావరణంలో ఉంది. బతుకమ్మ చీరలతో ఇంద్ర ధనుస్సును మరిపిస్తోంది. చేతి నిండా పని, ఆ పనికి అధిక వేతనం లభించనున్నందున కార్మికులు ఆనందంగా వస్త్రోత్పత్తిలో నిమగ్నమయ్యారు. గతంతో పోలిస్తే ఈ సారి మొత్తం ఆర్డరు సిరిసిల్లకే రావడంతో యజమాని, ఆసామి, కార్మికుడు – ఈ మూడంచెల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు పనీ పాటా బతుకమ్మ చీరే అయింది. రంగు రంగుల చీరలతో కన్నుల పండుగగా ఉన్నది.

మార్పుకు సిద్దమైన సిరిసిల్ల…

ఈ ఏడు బతుకమ్మ చీరల డిజైన్లు ఎంపికై, కావలసిన ఆర్డర్లు ఖాయం కావడం, వెనువెంటనే యజమానులు అవసరమైన నూలు తెప్పించడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రెండు నెలల క్రితం బతుకమ్మ చీరల పనిలో నిమగ్నమైంది. ఇప్పుడు ఆ ఆర్డర్ల పని దాదాపు మధ్యకు చేరింది. ఇంకో నెలలో పని పూర్తి చేయవలసి ఉంది. దాంతో సిరిసిల్ల తీరికలేకుండా ఉంది. కాస్త కునుకు తీయడానికి కూడా తెరిపి లేకుండా ఉన్నది. ఇంత పని, నైపుణ్యంతో కూడిన శ్రమ, ఒక రకంగా వారి ఇన్నేళ్ళ బద్దకాన్ని వదలగొట్టి, మారుతున్న కాలానికి అనుగుణంగా సిద్దం కావడానికి తర్ఫీదు నిస్తోంది. అంతేకాదు, పోయిన ఏడాదిలా కాకుండా, మగువల మనసెరిగి నేస్తున్న అందమైన చీరలు కూడా కావడంతో కార్మికుడు మరింత కష్టపడుతున్నాడు. జరీ చీర కూడా అయినందున మునుపటికన్నా అత్యధికంగా శ్రమిస్తూ, ఆ పనిలో ఆనందం వెతుక్కుంటున్నాడు. సంతృప్తిగా పగారీలు (కూలీలు) అందుకుంటున్నాడు.

సవాల్ ని సంబురంగా స్వీకరించిన సిరిసిల్ల..

ఇదిలా ఉంటే పద్మశాలీలకు పేరొందిన సిరిసిల్ల ఆవరణ అంతా, ఇక్కడి పవర్ లూమ్స్ నిరంతర శబ్దాలన్నీ వచ్చే బతుకమ్మ అట పాటలకు ఇప్పుడే చప్పట్లు కొడుతున్నట్టు ఉంది. వైపణి, బీంల నుంచి వార్పర్ల పైకి, అటు నుంచి మగ్గాలపైకి ఎక్కిన బతుకమ్మ చీర నిదానంగా ఖార్ఖానాలకు సరికొత్త అందం తెచ్చి పెట్టడమే ఈ వాతావరణానికి కారణం. ప్రతి వాడలోనూ ఇదే పని కావడంతో సిరిసిల్ల మొత్తం పండుగ చీరలతో, తీరొక్క రంగులతో సింగిడిలా మెరిసిపోతోంది. పనికి పని, ప్రతిష్ఠకు ప్రతిష్ఠగా మారిన బతుకమ్మ చీరల ఉత్పాదన సిరిసిల్లకు నిజంగానే అటు సవాల్. ఇటు గొప్ప సంబురం.

ప్రణాళికతో మున్ముందుకు…

గతంతో పోలిస్తే, ఇదివరకు ఎదురైన అవరోధాలను అధిగమించి, ఎటువంటి విమర్శలకు తావు లేకుండా, అవసరమైన జాగ్రత్తలు తీసుకొన్న ప్రభుత్వం ఈ దఫా బతుకమ్మ చీరల ఉత్పాదన కొంత ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ అధికారులు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళుతుండటం విశేషం. మహిళలకు నచ్చే విధంగా, వారి మనసు దోచుకునేలా చీరల తయారీ మొదలవడంతో ఈ సారి సిరిసిల్ల ఖార్ఖానాల్లో పండుగ వాతావరణం అడుగడునా కాన వస్తోంది.
గత ఏడు చీరలకన్నా ఈ ఏడు మరింత ఆకర్శణీయంగా బతుకమ్మ చీరలు ఉండబోతున్నవి. రంగులు కూడా ఎక్కువే. డిజైన్ కూడా మరింత ఉన్నతమైనది. నూలు కూడా నాణ్యమైనది. దీంతో ప్రభుత్వం ప్రజల మెప్పు పొందడం ఖాయం అన్న నమ్మికతో ఉంది.

కష్టంలోనే సుఖం..

కాకపోతే, చీరల్లో ఈ సారి పెరిగిన జరీ కారణంగా నేతన్నలు కష్టం చాలా పెరిగింది. అలాగే నూలు ధరలు మరింత ఎక్కువ కావడంతో యజమానులకు లాభాలు కాస్తా తక్కువే అని చెప్పాలి. ఐతే, తామంతా సిరిసిల్ల పేరు నిలపటానికి చాలెంజ్ గా తీసుకొని పని చేస్తున్నామని వారంటున్నారు.కాగా, కాస్త ఆలస్యగా పని మొదలైనందున కార్మికులు అహర్నిశలు శ్రమించవలసి వస్తోంది. అనుకున్న సమయానికి వస్త్రోత్పత్తి పూర్తి చేయడానికి కృషి చేసి, ఈ ఆర్డరును సద్వినియోగం చేసుకోవాలని అందరూ నడుం కట్టారు. ఈ సారి పని తీరుతోనే ఇక ముందు ప్రతి ఏటా బతుకమ్మ ఆర్డర్ సంపాదించుకోవాలని, దాంతో తమ భవిష్యత్తుకి డోకా ఉండదన్న తలంపుతో వారంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అధికారులు కూడా అనుకున్న సమయానికి పని పూర్తి చేయించాలని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.

నలభై రకాల చీరలు – అందమైన జరీ బార్డర్ ప్రత్యేకం..

ఈ సారి బతుకమ్మ చీరలు అటు పెద్దవాళ్ళు మెచ్చే రీతిలో ఇటు మధ్య వయస్కులు, యువతులకు నప్పే రీతిలో, ముగ్గురి అభిరుచులకు తగ్గట్టు చీరల తయారీ సాగలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఆ దిశగా పనులు సాగుతున్నాయి.
ప్రభుత్వం గత ఏడాది బతుకమ్మ చీరలను ఎనిమిది రంగుల్లో నేయించగా ఈ సారి మూడు రకాల చీరలను నలభై రంగుల్లో నేయిచండం మరో విశేషం.ఆ మూడు రకాలలో, ఒకటి ఐదున్నర మీటర్ల చీర. రెండవది, ఎనిమిది మీటర్ల రెండు అంగుళాల చీర (పెద్దలకు ఇచ్చే గోషిక చీరలు) , మూడవది, ఐదున్నర మీటర్ల దూప్ చాప్ చీర. చివరిదైన దూప్ చాప్ చీరను సిరిసిల్లలో నేయించి దానిపై హైదరాబాద్ లో అపురూపమైన కలంకారీ డిజైన్ ను ప్రింట్ చేపిస్తుండంతో ఈ చీర మరింత ఆకర్షణీయంగా ఉండబోతున్నది.
కాగా, ఈ మూడు రకాల చీరలకు రెండు ఇంచుల అందమైన జరీ బార్డర్ గా ఉండటం ఈ సారి విశేషం. బంగారు వర్ణంలో ఉన్న ఈ రెండు అంగుళాల జరీ కారణంగా బతుకమ్మ చీరలు పట్టు చీరల మాదిరి మెరిసిపోనున్నాయి. అందం, ఆకర్షణకు తోడు మరింత హుందాగా కనపడటం ఈ సారి ప్రత్యేకత.

కోటి చీరల వీణ – మరమగ్గాల సిరిశాల

దాదాపు కోటి చీరల ఆర్దరులో ఇప్పటికే 30 నుంచి 40 లక్షల చీరల తయారీ పూర్తయింది. మిగితా వాటిని శరవేగంగా పూర్తి చేయడానికి గాను మరింత మంది కార్మికులను నిమగ్నం చేయడంలో అధికారులు తలమునకలై ఉన్నారు. పనిలో ఉన్న వారికి కంటి మీద కునుకు లేదనే చెప్పాలి. అన్నట్టు, పనికి వంగని కొందరు పారిపోయారని కూడా చెప్పాలి. ఇలా, ఈ సారి బతుకమ్మ చీర సిరిసిల్ల పరిశ్రమకు నిజంగానే ఒక పరీక్ష అయింది. ఒళ్ళు వంచి కష్టపడితే బంగారు భవిశ్యత్తు గ్యారంటీ అని చెప్పకనే చెబుతోంది.మొత్తంగా ఈ చీరల వల్ల సిరిసిల్లకు చెందిన 104 మ్యాక్స్ సొసైటీలు, అందులోని 16,145 మర మగ్గాలు, అలాగే, 53 సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో  ఉన్న 3,580 మర మగ్గాలు పనిలోకి దిగాయి. అంటే, మొత్తం 19,666 మగ్గాలకు పని దొరికినట్టే అని చెప్పాలి.

పాతికవేల మందికి పనే పండుగ

కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం జియో ట్యాగింగ్ ఐన మగ్గాల సంఖ్య 26,000 ఉన్నాయి. ఇందులో 19, 666 మగ్గాలు బతుకమ్మ పనిలో ఉండగా, వీటిపై పనిచేసే దాదాపు 20 వేల కార్మికులతో పాటు సైజింగ్, వార్పింగ్, డయ్యింగ్, వైపణి వంటి 13 అనుబంధ విభాగాలకు చెందిన మరో ఐదువేల మందికి కూడా ఉపాధి దొరుకుతున్నది. కాగా, ఈ పరిశ్రమలో ఉన్న 150 మంది యజమానులు, 2,500 మంది దాకా ఉన్న ఆసాములు, ఈ నాలుగు నెలల పాటు సిరిసిల్ల పరిశ్రమలో ఉన్న సుమారు 25 వేల మందితో కలిసి బతుకమ్మ చీరల పనిలో నిమగ్నం కావడంతో ముందే చెప్పినట్టు ‘పనే’ ‘పండుగ’ అన్నట్టు సిరిసిల్ల కళకళ లాడుతోంది. కోటి చీరాల వీణగా మరమగ్గాల పరిశ్రమ కళకళ లాడుతోంది.