Breaking News
Home / 18+ / బతుకమ్మ చీరకు ఇక ‘సిరిసిల్ల’నే బ్రాండ్

బతుకమ్మ చీరకు ఇక ‘సిరిసిల్ల’నే బ్రాండ్

బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్లనే బ్రాండ్ గా మలచాలని మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఉండటం, వారి లక్ష్యం నెరవేర్చడాన్ని ఈ సారి సవాల్ గా తీసుకొని అధికార వ్యవస్థ పని చేయడం అంతటా కనిపిస్తోంది. “గతంలో సమయాభావం కారణంగా సిరిసిల్ల పరిశ్రమ కేవలం 70 కోట్ల ఆర్డర్ల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసింది, ఈ సారి 250 కోట్ల ఆర్డరు సిరిసిల్లకే ఇవ్వాలని చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ నిర్దేశించారు. ఇప్పటికే 157.50 కోట్ల ఆర్డరు పనికి ఆర్డర్లు అందించగా మిగితా మొత్తానికి కూడా ఆర్డర్లు దశల వారీగా అందుతాయి” అని సిరిసిల్ల చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు అశోక్ రావ్ చెప్పారు. “ఈ సారి చీరల నాణ్యత, వాటి ఆకర్షణ మెరుగ్గా ఉండి కళ్ళు తిప్పుకోనివ్వదు” అని కూడా అన్నారాయన. ఇదివరకు సమయాభావం వళ్ళ సూరత్ పై అధారపడ్డామని, ఇప్పుడు ఆ అవసరం లేదని కూడా చెప్పారు. “గతంలో రోడ్ల విస్తరణ వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అయ్యాయని, ఈ సారి అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకొని పని చేయిస్తున్నాం. కొత్తగా మరిన్ని మరమగ్గాలను పనిలోకి దించుతున్నాం” అని కూడా ఆయన అన్నారు.

“ఉమ్మడి ప్రయోజనాల ఆర్డరు”

బతుకమ్మ చీరల తయారీ వల్ల తమవంటి యజమానులకే కాదు, ఆసాములకు తగిన పని, కార్మికులకు అధిక వేతనంతో కూడిన ఉపాధి లభిస్తున్నదని, ఈ చీరల తయారీలో పరిశ్రమలోని అన్ని శ్రేణుల వారి ప్రయోజనాలు ముడివడి ఉన్నాయని, అందుకే అందరం బాధ్యతతో పని చేస్తున్నామని మాస్టర్ వీవర్ బూట్ల నవీన్ అన్నారు. “ఈ సారి అనుకున్న సమయానికి మన్నికైన చీరలు అందించగలిగితే దేశంలోని ఇతర రాష్ట్రాల దృష్టి కూడా సిరిసిల్లపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు చీరలు కూడా ఇక్కడ నేస్తున్నాం. ఇలాగే మరిన్ని ఆర్డర్లు పొందగలిగితే ఏడాది పొడవునా సిరిసిల్లకు పని లభిస్తుంది. ఇవన్నీ ఆలోచించే మేం లాభాపేక్షతో కాకుండా సిరిసిల్ల పనితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఒక యజ్ఞంలా ఈ పనిలోకి దిగాం” అని మరో మాస్టర్ వీవర్ దూడెం శంకర్ వివరించారు.

“చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత పని”

బతుకమ్మ చీరల పనిలో నిమగ్నమైన వార్పర్ లక్ష్మీ రాజం మాట్లాడుతూ, “మూడేళ్ళ క్రితం చేతిలో పని లేదు. ఇప్పుడు చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత పని ఉంది” అన్నాడు. వైపణి పని చేసే రామయ్య మాట్లాడుతూ, “ఆన్ని విభాగాలలోని వారికి పని దొరుకుతోంది. బాధ్యతగా పని చేసుకుంటే కార్మికుడికి, వార్పరుకు, వైపణి కార్మికుడికి నాలుగు వేల నుంచి పదివేల దాక అధిక వేతనం పొందే అవకాశం ఉంది. ఇతర అనుబంధ కార్మికులకే కాదు, ఆటోవాలా, హమలీలకు కూడా కావలసినంత పని ఉంది. నిజంగానే బతుకమ్మ చీర ఇంటిల్లిపాదికి పండుగే” అని అయన సంతోషంగా చెప్పాడు.

“పెరిగిన జీవన ప్రమాణాలు”

నిజమే. “సిరిసిల్ల పరిశ్రమకు బతుకమ్మ చీర ఒక సువర్ణావకాశం. మగువలు మెచ్చే బతుకు పండుగ ‘బతుకమ్మ’ సిరిసిల్ల కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపడమే కాదు, పండుగ కానుకగా ఇచ్చే ఈ చీరతో తెలంగాణ అమ్మలక్కలకూ ఈ సారి సంబురమే. “ఈ ఆర్డరుతో ఇక్కడి పరిశ్రమ బతికి బట్ట కట్టడమే కాదు, నిదానంగా కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ ఆర్డరు మరిన్ని ఆర్డర్లకు దోహదపడి పరిశ్రమ శాశ్వత పరిష్కారానికి కూడా మార్గం చూపెట్టే అవకాశం ఉంది. అంతకన్నా ఏం కావాలి?” అని చేనేత జౌళీ శాఖ కమిషనర్ శైలజా రామయ్యార్ అన్నారు.

“బతుకమ్మా! బతుకు” -కాళోజి కవితా చరణాలు

నిజమే, బతుకమ్మ చీర బతుకునిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక “బతుకమ్మా! బతుకు” అన్న కాళోజి కవితా చరణాలు అక్షర సత్యాలే అవుతున్నాయి.స్వరాష్ట్రంలో బతుకమ్మను రాష్ట్ర పండుగ చేసుకోవడం, అదే పండుగ సందర్భంగా నేతన్నలకు నిండుగా పని ఇవ్వడం- ఇదంతా కూడా నిజంగానే బతుకుల్లో పండుగ నెలకొంటున్న తీరుకు సాక్ష్యం. ఈ సంబుర వేల సిరిసిల్ల పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్న మంత్రి కేటీఆర్ కు సిరిసిల్ల కార్మికలోకం ముక్తకంటంతో శనార్థులు పలకడం ఒక ఆనందం.