Breaking News
Home / 18+ / శిల్పకళా వేధికలో ‘ఇకబెన’

శిల్పకళా వేధికలో ‘ఇకబెన’

జపాన్‌కు చెందిన అతి పురాతనమైన ఇకబెన కళను మంగళవారం మాదాపూర్‌లోని శిల్పకళా వేధికలో తెలంగాణ టూరిజం, ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ -250 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటిషు డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ, దేవి నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ సభ్యులు రేఖారెడ్డి ఇకబెన రూపొందించే విధానాలను వివరించారు. పువ్వులు, ఆకులు, కొమ్మలను ఒక పద్దతి ప్రకారం అమర్చితే వచ్చే అందమైన రూపాన్ని ఇకబెన అంటారని, ఇది జపాన్‌కు చెందిన అతిపురాతన కళ అన్నారు. ఇకబెన ఏదో ఒక వర్గానికి సంబందించింది కాదని, అందంగా రూపొందించిన ఇకబెన ఉత్పత్తులను ఇండ్లలో ఆఫీసుల్లో, మనకు నచ్చిన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారో అదే విధంగా జపాన్‌లో ఇకబెనను నిర్వహిస్తారని అన్నారు. ఇకబెనను ప్రతి నెలలో నిర్వహిస్తామని, సంవత్సరానికి ఒకసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని నవ పేరిట సరికొత్త ఇకబెనను రూపొందించినట్లు తెలిపారు. శిల్పకళా వేధికగా 9 రకాల ఇకబెనలను రూపొందించినట్లు తెలిపారు. అనంతరం ఇకబెన డిమనిస్ట్రేషన్‌పై శ్రద్ధరెడ్డి వివరించారు. దీంతో పాటుగా ఇకబెన ప్రదర్శనలో భాగంగా ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాలకు తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డాలు హాజరయ్యారు. బతుకమ్మ సంబురాలలో భాగంగా ఇకబెన హైదరాబాద్ సభ్యులతో కలిసి కేథరిన్ హడ్డా బతుకమ్మ సంబురాలలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్పోలెట్ జనరల్ కేథారిన్ బీ హడ్డా, సరితరెడ్డి, హైదరాబాద్ చాప్టర్ సభ్యులు పాల్గొన్నారు.