ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి – Dharuvu
Home / 18+ / ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి

ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆడపడుచులతో కలిసి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని.. బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు. అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. న్యూజిలాండ్ చరిత్రలో ప్రధాన మంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కారు.ఆమె రాకతో న్యూజిలాండ్ ఉన్న తెలంగాణ వాసులు ఆనందం వ్యక్తం చేసారు.

ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్‌లో బతుకమ్మ వేడుకల నిర్వహణపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాక్షాత్తూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప విషయం అని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను న్యూజిలాండ్ ప్రధాని గౌరవించారు. బతుకమ్మ ఆడిన ప్రధాని జెసిండాకు ధన్యవాదాలు అని కేటీఆర్ పేర్కొన్నారు.