Breaking News
Home / 18+ / గతంలోకంటే మెరుగైన, ప్రజలకు మరింతగా చేరువయ్యే పద్ధతిలో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో……

గతంలోకంటే మెరుగైన, ప్రజలకు మరింతగా చేరువయ్యే పద్ధతిలో టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో……

ప్రత్యర్థి పక్షాలు ఊహించని రీతిలో, తెలంగాణ ప్రజలంతా ఆనందోత్సాహాలతో మద్దతు పలికేలా, అత్యంత సమర్థవంతమైన, అందరూ మెచ్చతగ్గ, అందరికీ నచ్చే రీతిగా.. తాజా మ్యానిఫెస్టో రూపకల్పనలో టీఆర్‌ఎస్ కి చెందిన ప్రత్యేక నిర్ణాయక కమిటీ నిమగ్నమైంది. గతంలోకంటే మెరుగైన, ప్రజలకు మరింతగా చేరువయ్యే పద్ధతిలో విలక్షణ శైలితో, కులమతాలు, వర్గవయోభేదాలకు అతీతంగా, అనూహ్యమైన అంశాల కెన్నింటికో చోటు కల్పిస్తూ మ్యానిఫెస్టో తయారవుతున్నట్టు చెబుతున్నారు.

 

రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలను చూసిన తర్వాతే ప్రజలు ఆయా పార్టీలకు ఓట్లు వేస్తారన్నది నిజం. ఒక రకంగా ప్రజలకు అదొక భవిష్యత్ అభివృద్ధి ప్రణాళిక. రాబోయే రాష్ట్ర ప్రభుత్వానికి కాబోయే విజన్. తమ పార్టీ అధికారంలోకి వస్తే రానున్న ఐదేండ్లలో వారేం చేయబోతున్నారో చెప్పేదే ఈ మ్యానిఫెస్టో. ఎన్నికలు వచ్చాయంటే చాలు, పార్టీలకు అతీతమైన చాలామంది ప్రజల దృష్టి ఈ మ్యానిఫెస్టోలు, వాటిలోని వివిధ అంశాలు, హామీలపైనే ఉంటుంది. ఏ పార్టీ ఏం చెబుతున్నది, ఏం చేయాలనుకుంటున్నది, అసలు ఎవరికి తమ సమస్యలపట్ల నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నదీ, ఏ పార్టీ ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పాలించనున్నదీ.. ఈ మ్యానిఫెస్టోలతోనే తేటతెల్లమవుతుంది. ఇటీవలే రాష్ట్ర ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటితమైన క్రమంలో, డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ తనదైన ఎన్నికల మ్యానిఫెస్టోపై వేగంగా కసరత్తు చేస్తున్నది.

 

ప్రస్తుత మ్యానిఫెస్టోపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే ఒకానొక సందర్భం (గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చ)లో తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో పరిఢవిల్లాలంటే.. ఏ పార్టీ అయితే ప్రజల్లోకి పోయి ఓట్లు అడిగి అధికారంలోకి వస్తుందో.. ఆ పార్టీ ప్రభుత్వంగా రూపాంతరం చెందిన తర్వాత దాని ఆలోచనలు, విధానాలతోకూడిన ఎన్నికల మ్యానిఫెస్టోనే ఆ ప్రభుత్వ కార్యక్రమాలుగా అమలులోకి వచ్చి తీరాలి అని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగం టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలా ఉంది అన్న ప్రతిపక్షాల ఏకపక్ష విమర్శకు ఆయనిచ్చిన ధీటైన జవాబు ఇది. ఇంకా ఆయనేమన్నారంటే- గవర్నర్ ప్రసంగమంటేనే కచ్చితంగా టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో మాదిరిగానే ఉంటుంది. దానినే ప్రతిబింబిస్తున్నది. ప్రతిబింబించక తప్పదు. అలా జరగక పోతేనే అది తప్పు అవుతుంది. ఎందుకంటే, అశేష ప్రజామోదంతో ఎన్నికైన పార్టీ అధికారంలోకి వచ్చాక తన మ్యానిఫెస్టోలోని అంశాలనే అమలు చేయాలనుకుంటుంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం కొనసాగుతున్నట్టు లెక్క. అలా జరగనప్పుడే అది అప్రజాస్వామికం అవుతుంది అని సీఎం కేసీఆర్ ఆనాడే నొక్కివక్కాణించారు. ఇది మ్యానిఫెస్టో ప్రాధాన్యాన్ని చెప్పకనే చెబుతున్నది.

 

ఈసారి కూడా గతంలోలానే మ్యానిఫెస్టో అత్యంత విలక్షణంగా ఉంటుంది. ప్రజల కష్టాలను పూర్తిస్థాయిలో తీర్చే విధంగానే శాశ్వత ప్రణాళికలు, విధానాలతోనే ఆయా కార్యక్రమాల రూపకల్పన ఉంటుంది అని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అనేక ప్రజాసంఘాలు, సంస్థలు తమ ఆశలు, ఆకాంక్షల మేరకు ఈ కమిటీకి వినతిపత్రాలు అందచేశాయి. పార్టీ మ్యానిఫెస్టోలో తమ అంశాలు పొందుపరిస్తే అవి కచ్చితంగా అమలవుతాయన్నది ప్రతి ఒక్కరి నమ్మకం. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను పూర్తిస్థాయిలో అమలు పర్చడమేకాక అందులో లేని వినూత్న ప్రజోపయోగ అంశాలను సైతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టడం ఈ సందర్భంగా గమనార్హం. ఈసారి తమ సమస్యలను పొందుపరిస్తే అవి పరిష్కారమయ్యే అవకాశముందనే ఉద్దేశంతోనే చాలామంది పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందించారు.