విదేశాల్లోనూ వైభవంగా బతుకమ్మ వేడుకలు – Dharuvu
Home / 18+ / విదేశాల్లోనూ వైభవంగా బతుకమ్మ వేడుకలు

విదేశాల్లోనూ వైభవంగా బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ సంబురాలు దేశవిదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తోపాటు జర్మనీ, బ్రిటన్, కువైట్, ఆస్ట్రేలియా, షార్జాల్లో, సింగపూర్‌లో ఆదివారం ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బెర్లిన్ నగరంలో దాదాపు 200 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. లండన్‌లోని కెంట్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు డార్ట్‌ఫోర్డ్ డిప్యూటీ మేయర్ రోజర్ ఎస్ ఎల్ పెర్‌ఫిట్ హాజరయ్యారు. బెర్లిన్ వేడుకల్లో తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు చలిగంటి రవి, ప్రధానకార్యదర్శి రవి పెండ్రంకి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నార్త్‌మీడ్ హైస్కూల్ ఆవరణలో ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో సుమారు 1000 మంది మహిళలు బతుకమ్మ ఆడి పారామటా నదిలో నిమజ్జనం చేశారు.

తెలంగాణ చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో కువైట్‌లోని ఫింటాస్‌హాలులో జరిగిన బతుకమ్మ సంబురాలకు కువైట్‌లో భారత రాయబారి కే జీవన్‌సాగర్ విచ్చేశారు. తెలంగాణ సాంస్కృతిక, సంక్షేమసంఘం, తెలంగాణ జాగృతి యూఏఈ శాఖల ఆధ్వర్యంలో షార్జా స్కైలైన్ వర్సిటీలో జరిగిన వేడుకల్లో అరబ్ మహిళలు కూడా పాల్గొని బతుకమ్మ ఆడారు. గోవా వాస్కోడిగామాలోని రైల్వే ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. సింగపూర్‌లో తెలంగాణ ఫ్రెండ్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్ సంఘం అధ్యక్షుడు పెద్ది చంద్రశేఖర్‌రెడ్డి, సింగపూర్ తెలుగుసమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి పాల్గొన్నారు.