Breaking News
Home / 18+ / రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలే…కేటీఆర్

రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలే…కేటీఆర్

శనివారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే మాట్లాడారని విమర్శించారు. ఆయనకు తెలంగాణపై కనీస అవగాహన లేదని అన్నారు. ఎవరో రాసిచ్చిన ప్రసంగాలు చదువటంకాకుండా.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాహుల్‌కు హితవుపలికారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు తొలిగించారని, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని రాహుల్ చెప్పినవన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. రాహుల్, నరేంద్రమోదీ ఇద్దరూ దేశాన్ని వంచించారని, తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాగా వేయడానికి కాంగ్రెస్ అనే వృద్ధ జంబూకం ప్రయత్నాలు చేస్తున్నదని ఎద్దేవాచేశారు. శనివారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు తొలిగించారంటూ రాహుల్ కుసంస్కారంతో, దుర్మార్గంగా మాట్లాడారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో రూపొందించిన ప్రాజెక్టులనుంచి సాగు, తాగునీరు శరవేగంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ డిజైన్లలోని తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నంలో చాలా ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ రిటైర్డ్ ఇంజినీర్ల సహకారంతో రీడిజైన్ చేయించారని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు కొనసాగుతున్నదని, అది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నదన్న విషయాన్ని రాహుల్ తెలుసుకోవాలని సూచించారు. రాహుల్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన కేటీఆర్.. ఈ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.

అంబేద్కర్‌ను గౌరవించని కాంగ్రెస్, అంబేద్కర్ మరణించిన 34 ఏండ్ల తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు దక్కిందన్న కేటీఆర్.. రాజ్యాంగ రచయితకు ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, వీపీ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో భారతరత్న ఇచ్చారని గుర్తుచేశారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్ గుర్తించలేదనటానికి ఇదే నిదర్శనమని చెప్పారు. విజ్ఞతతో ఆలోచించాలని, ఏదిపడితే అది మాట్లాడవద్దని, చేసిన వ్యాఖ్యలను సవరించుకోవాలని రాహుల్‌కు సూచించారు. కాంగ్రెస్ సంక్షోభంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి జవసత్వాలు కల్పించి, దేశ ప్రధానిగా పనిచేసి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తెలుగు, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించిందని కేటీఆర్ విమర్శించారు. పీవీ చనిపోతే ఆయన పార్థివదేహాన్ని కనీసం కాంగ్రెస్ కార్యాలయంలోకి కూడా తీసుకుపోనివ్వలేదని గుర్తుచేశారు. మాజీ ప్రధానులు అందరికీ ఢిల్లీలో ఘాట్లు, స్తూపాలు ఉంటే.. పీవీకి మాత్రం లేదని చెప్పారు. హైదరాబాద్‌లో పీవీ అంత్యక్రియలను కూడా సరిగా నిర్వహించలేదని, ఆయన భౌతికకాయం పూర్తిగా కాలకుండా నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటన్నింటినీ తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. కాంగ్రెస్ ఇలాంటి నీచమైన, కుసంస్కారమైన పార్టీ అన్నారు. కానీ నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్ పాలనలో పార్టీపరమైన తేడాలు చూడకుండా పీవీ నరసింహారావు పేరును ఒక యూనివర్సిటీకి పెట్టామని, వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ మీద స్థాపించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఏనాడూ ఉచ్ఛరించని కుమ్రంభీం పేరును కొత్త జిల్లాకు పెట్టామని, జయశంకర్, కొండాలక్ష్మణ్ పేర్లు యూనివర్సిటీలకు పెట్టామని తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి తల్లి ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు.

సాగునీటి ప్రాజెక్టుల గురించి రాహుల్‌గాంధీ లెక్కలతోసహా మాట్లాడితే మంచిదని కేటీఆర్ సూచించారు. కాళేశ్వరం విషయంలో రాహుల్ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రూ.17 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారని, అదే ప్రాజెక్టుకు 2008లోనే రూ.38,200 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని చెప్పారు. 2010లో సీఎంగా రోశయ్య ఉన్నప్పుడు రూ.40,300 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని గుర్తుచేశారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందనే విషయాన్ని రాహుల్ గుర్తుంచుకోవాలన్నారు. తాజాగా కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ తుది అంచనా వ్యయం రూ.80,190 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు. ఈ అంచనా వ్యయం పెరుగటానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగానే 2013 భూసేకరణ చట్టంతో అంచనా వ్యయం కూడా భారీగా పెరిగిందన్నారు. ఈ చట్టానికి ముందు ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు పరిహారం చెల్లిస్తే.. ఆ తరువాత ఎకరానికి రూ.6 నుంచి రూ.12లక్షల వరకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో రిజర్వాయర్ల సామర్థ్యం 16 టీఎంసీలు మాత్రమే ఉండగా రీడిజైన్‌లో పదిరెట్లు.. అంటే 160 టీఎంసీలకు పెంచామన్నారు. వీటితోపాటుగా మూడు బరాజ్‌లు, మూడు పంపుహౌస్‌లు అదనంగా నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ నిండుకుండలా ఉండాలని, రెండుమూడేండ్లు కరువు వచ్చినా ఇబ్బంది ఉండకూడదని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. వీటన్నింటితోపాటు పెరిగిన ధరలు, జీఎస్టీ తదితరాలతో అంచనా వ్యయం పెరిగిందని వివరించారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరుగడంలేదా? 2010లో ఉన్న అంచనా వ్యయమే 2018లో కూడా ఉంటుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అబద్ధాలతో ఆరోపణలు చేయడానికి రాహుల్‌కు సిగ్గుగా అనిపించడంలేదా? అని నిలదీశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అవినీతి, దోపిడీ అంటూ మాట్లాడటం సరికాదన్నారు.