Home / ANDHRAPRADESH / ఖ‌మ్మం జిల్లాకు జ‌వాబిచ్చిన త‌ర్వాతే అడుగుపెట్టు బాబు-సీఎం కేసీఆర్.

ఖ‌మ్మం జిల్లాకు జ‌వాబిచ్చిన త‌ర్వాతే అడుగుపెట్టు బాబు-సీఎం కేసీఆర్.

ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చబడాలంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ ఖమ్మం జిల్లా పచ్చబడటం చంద్రబాబుకు ఇష్టం లేక.. ఈ ప్రాజెక్టుకు ఆయన అడ్డుపడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.“భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత తుమ్మల నాగేశ్వరరావుదే. తుమ్మల పనిగురించి ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు .

పాలేరు పచ్చబడడానికి తుమ్మలనే కారణం“. అని ఆయ‌న వెల్ల‌డించారు.డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. `ఏడు మండలాలు అక్రమంగా తీసుకోకముందు 180 కిలోమీటర్లు గోదావరి పారేది. 180 కిలోమీటర్లు పారే గోదావరి ఉన్న తర్వాత ఈ జిల్లాలో కరువు ఎట్లా ఉంటది. మన ఖర్మ కాకపోతే. ఇన్ని కిలోమీటర్లు పారే గోదావరి జిల్లాలో కరువు ఉంటదా? కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇవాళ సిగ్గు లేకుండా మళ్లీ పోటీకి వస్తున్నారు.

కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎందుకు ఖమ్మంకు నీళ్లు ఇవ్వలేదు? మనం ప్రజలం కాదా? ఖమ్మంకు గోదావరిలో హక్కు లేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ జలదోపిడీ చేసిన వైఎస్ రాజశేఖర్ పోలవరం, దుమ్ముగూడెం టేల్ ద్వారా ఆంధ్రాకు నీళ్లు తీసుకుని పోయేందుకు గిరిజనుల నోట్లో మట్టికొట్టారు. ఖమ్మం జిల్లాకు గోదావరి ద్వారా నీళ్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లా ఈ జిల్లాను తయారు చేయబోతున్నాం. పాలేరు బాటలోనే ఖమ్మం జిల్లా మొత్తం పచ్చబడాలి అంటే సీతారామ ప్రాజెక్టు పూర్తి కావాలి. కానీ ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిండు. దీనిపై ఖమ్మం జిల్లా ప్రజలు ఆలోచించాలి. ప్రచారానికి వచ్చే ముందు బాబు సమాధానం చెప్పాలి. లేదంటే ప్రజలు చంద్రబాబును అడ్డుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని ఖమ్మం జిల్లాలో టీడీపీ తరపున అభ్యర్థులను నిలబెట్టారో నిలదీయాలి. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించే వారిని జిల్లాలో అడుగుపెట్టనివ్వొద్దు. మనకు నీళ్లు రాకుండా అడ్డుపడే వాళ్లకు ఓట్లు ఎలా వేస్తారు? సీతారామ ప్రాజెక్టు మీద రాసిన లేఖను విరమించుకున్నాకే ప్రచారానికి చంద్రబాబు రావాలని కేసీఆర్ సూచించారు.