Home / 18+ / రేపే గ్రేట‌ర్‌లో గులాబీ పండుగ‌

రేపే గ్రేట‌ర్‌లో గులాబీ పండుగ‌

హైద‌రాబాద్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ మ‌రోమారు త‌న ప్రత్యేక‌త‌ను చాటుకోనుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధాని వేదికగా భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. సభకు భారీగా జన సమీకరణ చేయాలని గ్రేటర్ టీఆర్‌ఎస్ నాయకులు నిర్ణయించారు.

నగర పోలీస్‌కమిషనర్ అంజనీకుమార్ ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం సభాప్రాంగణాన్ని పరిశీలించారు. భారీసంఖ్యలో పార్టీశ్రేణులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పార్కింగ్ ఏర్పాట్లపై అరాతీశారు. భారీబందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. ఆదనపు బలగాలను రంగంలోకి దింపి నిరంతరం అప్రమత్తంగా ఉంటామని వివరించారు. కమిషనర్ వెంట ఉన్నతాధికారులు అనిల్‌కుమార్, చౌహాన్, షిఖాగోయల్, తరుణ్‌జోషి, నార్త్‌జోన్ డీసీపీ కమలేశ్వర్, అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు.