Home / NATIONAL / కేంద్రం సంచ‌ల‌నం…2000 నోట్ల ముద్ర‌ణ నిలిపివేత‌

కేంద్రం సంచ‌ల‌నం…2000 నోట్ల ముద్ర‌ణ నిలిపివేత‌

కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జారీ చేసిన రెండేళ్లకే రూ.2000 నోటు ప్రింటింగ్ ను కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. ప్ర‌ముఖ మీడియా సంస్థ ద ప్రింట్ కథనం ప్రకారం కేంద్ర సర్కార్ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసింది. రూ.2000 నోట్లతో మనీ లాండరింగ్, పన్ను ఎగవేత సులువవుతుందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఏప్రిల్ 2018లో ఆదాయపన్ను శాఖ అనేక నగరాల్లో జరిపిన దాడుల్లో రూ.2000 నోట్ల రూపంలో భారీగా నగదు బయటపడటంతో ఈ ఆరోపణ నిజమేనని తేలింది. దీంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది.

నవంబర్ 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. పెద్దనోట్ల రద్దు కారణంగా నగదు కష్టాలను తీర్చేందుకు పెద్ద నోటును మార్కెట్లోకి వదిలారు. కానీ మార్కెట్లోకి వచ్చిన రెండేళ్లకే రూ.2000 నోటు ముద్రణను ఆపేయడం జరిగింది. ఈ నోటుని ప్రవేశపెట్టడంపై మోడీ సర్కార్ ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్రం రూ.2000 పెద్ద నోటును లాంచ్ చేయడాన్ని ప్రతిపక్షాలతో పాటు ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు సైతం తీవ్రంగా విమర్శించారు. కోటక్ మహింద్ర మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ సైతం రూ.1000 నోటును రద్దుచేసి రూ.2000 నోటును జారీ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.

ఈ నిర్ణయంతో ప్రింటింగ్ ఆగిపోయినా ఇప్పటికే మార్కెట్లో ఉన్న నోట్లు మాత్రం చలామణిలో ఉండనున్నాయి. 2018 మార్చి నాటికి రూ.18.03 లక్షల కోట్ల నగదు మార్కెట్లో చలామణిలో ఉంటే అందులో 37 శాతం(రూ.6.73 లక్షల కోట్లు) రూ.2,000 నోట్లు కాగా, 43 శాతం(రూ.7.73 లక్షల కోట్లు) రూ.500 నోట్లు కాగా మిగిలినవన్నీ చిన్న నోట్లే.