చదువులు, జీవితాలు చెడగొట్టుకోవద్దు.. జగన్ హామీతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్ధులు – Dharuvu
Home / 18+ / చదువులు, జీవితాలు చెడగొట్టుకోవద్దు.. జగన్ హామీతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్ధులు

చదువులు, జీవితాలు చెడగొట్టుకోవద్దు.. జగన్ హామీతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్ధులు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్నటివరకూ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా నడిచారు. అనంతరం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తిరుపతి నుంచి ఇడుపులపాయ వెళ్తున్న జగన్ కు రైల్వేకూడురులోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు కొన్నేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్నారు. ఇంకా జగన్ వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. విద్యార్థులతోపాటు నిరసనలో జగన్‌ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నారు.. ప్రజలందరి దీవెనలతో త్వరలో మనందరి ప్రభుత్వం వస్తుంది. వెంటనే గ్రామ సెక్రటేరియట్‌ను తీసుకొస్తాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం కార్యక్రమాన్ని అమలుచేస్తామన్నారు.

గ్రామ సెక్రటేరియట్‌లో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు సూచనలు ఇచ్చే కార్యక్రమం చేయాలంటే టెక్నికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న అగ్రికల్చర్, హార్టికల్చర్‌ విద్యార్థుల సేవలు అవసరం అని వాటిలో మీకు అధిక ప్రాధాన్యం ఇస్తాం అన్నారు. రాబోయే రోజుల్లో మీ సేవలను పూర్తిగా ఉపయోగించుకుంటాం. చంద్రబాబును నమ్మి అనవసరంగా చదువులు, జీవితాలు చెడగొట్టుకోకండి. చంద్రబాబు జీఓ ఇవ్వలేదని బాధపడొద్దన్నారు. మన ప్రభుత్వం వచ్చాక గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తాం. గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్‌ హార్టికల్చర్‌ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. జగన్ హామీతో విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేశారు.