Home / TELANGANA / సీఎం కేసీఆర్ సంచ‌ల‌నం..ఎంపీగా సీనియ‌ర్ ఐఏఎస్‌

సీఎం కేసీఆర్ సంచ‌ల‌నం..ఎంపీగా సీనియ‌ర్ ఐఏఎస్‌

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? త‌ను అత్యంత గౌర‌వించే ఓ సీనియ‌ర్ ఐఎఎస్‌ను ఆయ‌న ఢిల్లీ పంపించ‌నున్నార‌? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న మాజీ సీఎస్‌ డాక్టర్‌ రాజీవ్‌శర్మను పార్లమెంటు బరిలో దింపేందుకు సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నారని మీడియా సర్కిల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. సామాజిక సమీకరణాలతోపాటు విద్యాధికులు అధికంగా ఉండే మల్కాజిగిరి నుంచి రాజీవ్‌ శర్మను పోటీకి దించితే గెలుపు సునాయసమవుతుందని సీఎం భావిస్తున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది.

గ్రేట‌ర్ ప‌రిధిలోని మల్కాజ్‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అక్కడి నుంచి రాజీవ్‌శర్మను బరిలోకి దింపేందుకు కేసీఆర్‌ యోచిస్తున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అయిన ఆయన శ‌ర్మ గతంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు. ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు.. పార్టీకి బాగా ఉపయోగపడతాయని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే కీల‌క‌మైన ముఖ్య స‌ల‌హాదారు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇప్పుడు అదే ప‌రిచ‌యాల‌తో మ‌రోమారు చ‌ట్ట‌స‌భ‌ల్లో శ‌ర్మ త‌ర‌ఫున తెలంగాణ గ‌ళం వినిపించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.