Home / 18+ / ఫ్లడ్ లైట్ల వెలుగులో మినీ స్టేడియాలుగా మారిన తోటలు… సమస్తమూ అక్కడే!

ఫ్లడ్ లైట్ల వెలుగులో మినీ స్టేడియాలుగా మారిన తోటలు… సమస్తమూ అక్కడే!

ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కోడి పందాలకు రంగం సిద్ధమైపోయింది. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కోడిపందాలకు ఎటువంటి ఆటంకాలు ఉండవని భావిస్తున్న పందెం రాయుళ్లు, భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భీమవరం, ఏలూరు, నరసాపురం, ఉండి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల్లోని తోటలను కోడి పందేలు జరిపే మినీ స్టేడియాలుగా మార్చేశారు. రాత్రిపూట పందాలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటయ్యాయి. చుట్టూ బారికేడ్లు, అతిథులు కూర్చునేందుకు కుర్చీలు, వీఐపీల కోసం సోఫాలు వచ్చేశాయి.ఈ ప్రాంతాల్లో కోడి పందాలతో పాటు గుండాట, మూడు ముక్కలాట తదితర పందాలు కూడా సాగనున్నాయి.

వచ్చీపోయే వారికి కావాల్సిన సమస్తమూ ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి. కావాల్సిన ఆహారం, తాగినంత మద్యం సరఫరాకు ఏర్పాట్లు జరిగిపోయాయి. అతిథులకు సకల మర్యాదలు చేస్తామని, తమ ప్రాంతానికి రావాలని ఇతర ప్రాంతాల్లోని పందెం రాయుళ్లకు ఆహ్వానాలు పంపారు. పందేలు కాసేవారి కోసం, తమకు సమీపంలోని పట్టణంలో హోటల్ గదులు బుక్ చేసేశారు. సంప్రదాయం పేరిట కోళ్ల పందాలకు సిద్ధమైన పందెం రాయుళ్లు, ఈ సంవత్సరం రూ. 100 కోట్లకు పైగా పందాలు కాయనున్నారని సమాచారం.