తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా.. సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్లో పేర్కొన్న అక్షరమాల ఆధారంగా మిగతాసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
“కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను“.. అంటూ సీఎం కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.