ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని ఫోన్లకు అతుక్కుపోని వారిని వెతుక్కోవాల్సి వస్తోందనేది అతిశయోక్తి కాదేమో! ఈ ఒరవడిలో చోటుచేసుకుంటున్న అపశృతులు ఎన్నో. తాజాగా మొబైల్లో టిక్ టాక్ యాప్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ లో అప్ లోడ్ చేస్తున్న డబ్ స్మాష్ వీడియోలు, ఫన్నీ వీడియోలు తెగ పాపులర్ అయిపోతున్నాయి. అయితే వినోదం కోసం వాడే టిక్ టాక్ యాప్ కొన్ని సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. దీనికి మూకుతాడు వేసేందుకు తాజాగా తమిళనాడు సర్కారు సన్నద్ధమవుతోంది.
టిక్‌టాక్‌లో కొందరు ఆకతాయిలు ఈ యాప్ లో అసభ్యకరమైన, అశ్లీల సంభాషణలతో కూడిన వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలతో యువత ప్రేరేపితమై నేరాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. టిక్ టాక్ యాప్ తో యువత పెడదోవ పడుతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని భావిస్తున్న సీఎం పళనిస్వామి ప్రభుత్వం ఈ యాప్ ను నిషేధించాలని భావిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీసేలా యువతను తప్పుదోవ పట్టిస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు సమాచార, సాంకేతిక శాఖ మంత్రి ఎం మణికందన్ ప్రభుత్వాన్ని కోరారు. వినియోగదారులు అభ్యంతరకరమైన డ్యాన్స్ వీడియోలను టిక్ టాక్ లో అప్ లోడ్ చేస్తున్నారని, యాప్ పై తక్షణమే నిషేధం విధించాలని పట్టాలి మక్కల్ కట్చి పార్టీ నేత ఎస్ రామ్ దాస్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. దీంతో త్వరలోనే నిర్ణయం వెలువడనుందని సమాచారం.