Breaking News
Home / POLITICS / భ‌ట్టికి ఊహించ‌ని షాక్‌…!!

భ‌ట్టికి ఊహించ‌ని షాక్‌…!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో మ‌రో నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ సంద‌ర్భంగా ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ రాష్ట్రంలోని ప‌రిణామాల‌పై ఘాటుగా స్పందించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి ఈ మేర‌కు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిషలు కష్టపడుతున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్‌ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి అన్నారు.అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్నట్లుగా కందాల ఉపేందర్‌ రెడ్డి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నాయకత్వాన్ని బలపరుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారన్నారు. కేసీఆర్‌ కూడా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా అవిరళ కృషి జరుపుతున్నారని అన్నారు. ఖమ్మం జిల్లాలోని మొత్తం వ్యవసాయ భూమికి సాగునీరు అందించే లక్ష్యతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించడానికి భక్తరామదాసు ప్రాజెక్టును శరవేగంగా నిర్మించారని, కరువు పీడిత పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తయి, మొత్తం జిల్లా పచ్చబడుతుందనే పూర్తి నమ్మకం తనకు కలిగిందన్నారు.

విద్యుత్‌, రహదారులు, మంచినీరు తదితర విషయాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కూడా జరగని పనులెన్నో కేసీఆర్‌ నాయకత్వంలో జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంపై సంపూర్ణ అవగాహన, అభివృద్ధి విషయంలో అంకితభావం కలిగిన నాయకుడు కేసీఆర్‌ తప్ప రాష్ట్రంలో మరొకరు తనకు కనిపించడంలేదన్నారు. ప్రజల బాగు కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కష్టపడుతున్న కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి ప్రజా తీర్పు కోరడానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానని ప్రకటించారు.