Home / ANDHRAPRADESH / కృష్ణాజిల్లాలో ఇంకా కమ్మని రాజకీయమే నడుస్తుందా.? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా.?

కృష్ణాజిల్లాలో ఇంకా కమ్మని రాజకీయమే నడుస్తుందా.? ప్రజలు మార్పు కోరుకుంటున్నారా.?

ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు.. మరోవైపు కష్టించి పనిచేసే మనుషులు.. ఒకప్పుడు రౌడీయిజానికి ఇప్పుడు రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ విజయవాడ.. విద్య, సినిమా, పత్రికారంగం, వ్యాపారం అన్నిటికీ పుట్టినిల్లు మాత్రం కృష్ణాజిల్లానే.. అలాంటి జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుల సమీకరణాలు రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే కృష్ణాజిల్లాలో గెలుపెవరిది.. ఏపార్టీ ఎలా ముందుకెళ్తుంది.. ఓటరు ఎటువైపు నిలబుడుతున్నాడు అనే అంశాలపై దరువు రిపోర్ట్..

జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలున్న కృష్ణా జిల్లాలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది.. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 16 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 11 స్థానాలను కైవసం చేసుకుంది.. వైసీపీ నాలుగు స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా.. ఒక స్థానం నుంచి బీజేపీ విజయం సాధించింది.. మచిలీపట్నం బెజవాడ రెండు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీనే గెలిచింది. విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ తరపున గెలిచిన జలీల్ ఖాన్, పామర్రు నియోజకవర్గం నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పనలు టీడీపీలో చేరారు.. దీంతో జిల్లాలో టీడీపీ బలం 13కి పెరగగా వైసీపీకి కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలున్నారు. అయితే జిల్లాలో ఇదే పట్టు నిలుపుకునేందుకు ముగ్గురిని మంత్రులుగా చేసింది టీడీపీ.. మైలవరం నియోజకవర్గం నుంచి గెలిచిన దేవినేని ఉమా నీటిపారుదల శాఖ, మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలిచిన కొల్లు రవీంద్ర న్యాయశాఖ, కైకలూరులో బీజేపీ నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశాఖమంత్రిగా పనిచేసారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన సపోర్ట్ కూడా టీడీపీకి కలిసొచ్చాయి.. అయితే గత పరిస్థితి ఈసారి లేదనే చెప్పాలి.. బీజేపీ, జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వటం వల్ల అత్యధిక సీట్లు రాగా ఇప్పుడు ఓట్లు చీలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. కులాల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ జిల్లాలోరి కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఓటింగ్ కీలకంగా మారింది. విజయవాడ ఈస్ట్, పెడన, కైకలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం సామాజిక పరంగా ఉంది.. ఇక్కడ టీడీపీ జనసేన ఓట్లు చీలితే వైసీపీకి లాభిస్తోంది అనేది వైసీపీ ఐడియా.. పెడన, మైలవరం నియోజకవర్గాల్లో గౌడ సామాజిక వర్గం అభ్యర్థి విజయాన్ని శాసించనున్న నేపద్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గౌడన్నలు జగన్ కు జై కొడుతున్నారు.

కృష్ణానది ప్రవహిస్తున్నా ఈ జిల్లాలో చాలాచోట్ల తాగునీటికి ప్రజలు ఇప్పటికీ అల్లాడిపోతున్నారు. చివరికి విజయవాడ సిటీలో కూడా సరైన తాగునీరు అందడం లేదు. అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని తీర ప్రాంతాల్లో తాగునీటికి అల్లాడిపోతున్నారు. నందిగామ, జగ్గయ్యపేటలోనూ నది పక్కనేఉన్నా కృష్ణా జలాలు అందడం లేదు.. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం ఎప్పటినుంచో పెండింగ్ లో ఉంది. ముఖ్యమంత్రి పోర్టు పనులు ప్రారంభించినప్పటికీ అది హడావిడే తప్ప మరోకటి కాదనేది ప్రజలమాట. గత ఎన్నికల్లో వైసీపీ చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది.. కులాల ఈక్వేషన్ల ప్రకారం కమ్మకుల ప్రభావం ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో గతంలో ఇతర కులస్థులను బరిలోకి దింపి ఓటమి పాలయింది వైసీపీ. అందుకే ఈసారి ఆ నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గ అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన జనసేన కొద్ది స్థానాల్లో మాత్రమే పోటీకి దిగుతుంది. అక్కడ కూడా విజయావకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా విజయ డెయిరీ డైరెక్టర్‌ దాసరి వెంకట బాలవర్థన్‌రావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. బాలవర్థన్ టీడీపీ వ్యవస్థాప సభ్యుల్లో ఒకరైన ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ సోదరుడు. జై రమేష్ కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మైలవరంలో దేవినేనికి తీవ్ర వ్యతిరేకత ఉంది.. వసంతకృష్ణ ప్రసాద్ భారీ మెజారిటీతో గెలుస్తాడనే అంచనాలు వెలువడుతున్నాయి. అవనిగడ్డనుంచి సింహాద్రి రమేష్, పామర్రు నుంచి కైలే అనిల్ కుమార్, గుడివాడనుంచి కొడాలి నాని, పెండన నుంచి జోగి రమేష్ ల గెలుపు నల్లేరుపై నడకగా మారరిందని తెలుస్తోంది. ఇక విజయవాడ నగరం నుంచి బరిలోకి దిగుతున్న మల్లాది విష్ణుకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.. బోండా ఉమ భూ కబ్జాలు, కాల్ మనీ ఘటనలతో విసిగిన విజయవాడ ప్రజలు వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవ కుమార్ లకు బ్రహ్మరధం పడుతున్నారు. ఇక పెనమలూరులో బోడె ప్రసాద్, పార్ధసారధికి టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. కారణం ఓటర్లలో 60శాతం కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు ఉండడమే ఇక్కడ టీడీపీకి ప్లస్ పాయింట్.. ఇక విజయవాడ పార్లమెంట్ నుంచి బరిలోకి దిగుతున్న పారిశ్రామికవేత్త పీవీపీకి సామాజికవర్గ సపోర్ట్ కూడా దక్కనుండడంతో పీవీపీ బంపర్ మెజారిటీతో గెలవనున్నారని తెలుస్తోంది.