Home / SLIDER / ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం

ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు నిన్న మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 3,571 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, 8జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 21, వామపక్షాలు71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీస్థానాల్లో, 6జెడ్పీటీసీల్లో స్వతంత్రులు, ఇతరులు గెలుపొందారు. అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన ముగ్గురు అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,తేరాప చిన్నపరెడ్డి,పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందిన సంగతి విదితమే. ఇటు ఎమ్మెల్సీ అటు స్థానిక సంస్థల్లో కారు ప్రభంజనం గురించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ” టీఆర్ఎస్ చరిత్రలో అతిపెద్ద విజయం సాధించింది. జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మించి పరిషత్ ఎన్నికల్లో విజయాన్ని అందించారు”అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలతో ప్రభంజనం సృష్టించింది.రాష్ట్రంలోని 32జెడ్పీలకు గానూ 32జెడ్పీలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మకం.టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో ఎంత పటిష్టమైన పునాది ఉందో ఈ ఫలితాలే రుజువులు .

ఈ పరిషత్ ఎన్నికల్లో కష్టపడ్డ జిల్లా పార్టీ ఇన్ ఛార్జిలకు అభినందనలు.వందశాతం జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరుగలేదు.ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం. దేశంలో ఏ పార్టీ సాధించని ఘనత టీఆర్ఎస్ సాధించింది.తెలంగాణ ప్రజల చైతన్యానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు . విజయంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు ఇది గెలుపు కాదు..ప్రజలు మనకిచ్చిన బాధ్యత. ఇంతటి ఘనవిజయాన్ని అందించి ప్రజలు మాపై బాధ్యతను మరింత పెంచారు అని ఆయన అన్నారు..మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వివేకానంద, మాగంటి గోపీనాథ్, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ గుండు సుధారాణితో కలిసి తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.