Breaking News
Home / EDITORIAL / ఆచార్య శ్రీ జయశంకర్ సారు యాదిలో…!

ఆచార్య శ్రీ జయశంకర్ సారు యాదిలో…!

తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరిగిపోని శిలాక్షరం…ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం…తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత…ఆచార్య శ్రీ కొత్త పత్తి జయశంకర్ సార్ జయంతి నేడు. సమైక్యపాలనలో అన్ని విధాల దగా పడుతున్న తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను రేకెత్తించిన ..ఆచార్య జయశంకర్ 1934, ఆగస్టు 6న అంటే సరిగ్గా ఇదే రోజున ఉమ్మడి  వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట లో జన్మించారు. జయశంకర్ సార్‌‌కు ఈ నేల అన్నా, అమాయకులైన తెలంగాణ ప్రజలన్నా ఎంతో అభిమానం. ఆరుదశాబ్దాలుగా నోరు లేని తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక అయ్యాడు.
విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి తెలంగాణవాదాన్ని వినిపించాడు.1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి మన జయశంకర్ సార్… అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించేవాడు…. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతిరోజూ పుంఖాను పుంఖాలుగా రచనలు చేసిన అక్షర యోధుడు మన జయశంకర్ సారు. తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ఆచార్య మలి దశ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచారు.
తెలంగాణ ప్రజల రాష్ట్ర స్వరాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేందుకు  టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర‌్భవించేందుకుగాను కేసీఆర్‌కు దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ గారు పార్టీ పెట్టే ముందు జయశంకర్ సార్‌తో గంటల కొద్ది చర్చలు జరిపేవారు. సారు అందించిన స్ఫూర్తితో కేసీఆర్  ఉద్యమ కెరటమై ఎగిసి పడ్డారు. కేసీఆర్‌తో కల్సి జయశంకర్ సారు తెలంగాణలో తిరగని ప్రాంతం లేదు..తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు.తరతరాలుగా తెలంగాణకు సీమాంధ్ర పాలకులు, మీడియా చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి గంటల తరబడి వివరించే సత్తా, సాధికారత మన మాష్టారి సొంతం.. నీళ్లు, ఉపాధి, విద్య, సంస్కృతి…ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందులో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఆయన బాధాతప్త హృదయంతో చెబుతారు. ఇక మన భాషను, యాసను ఎగతాళి చేసిన సీమాంధ్రులను అడుగడుగునా ఎండగట్టారు..
జయశంకర్ సార్ చూపిన బాటలో కేసీఆర్   సారథ్యంలో తెలంగాణలోని ప్రతీపల్లె పోరాటబాట పట్టింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన మలి దశ ఉద్యమంలో ప్రతి క్షణం కేసీఆర్   వెన్నంటే ఉన్నారు  మాష్టారు. కేసీఆర్‌తో కల్సి జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద , విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షలను బలంగా వినిపించిన పోరాట శీలి..ఆచార్య జయశంకర్.
మలి దశ ఉద్యమంలో కీలక దశ చేరుకున్న తరుణంలో కేసీఆర్ అమరణ దీక్ష మొదలు పెట్టినప్పుడు జయశంకర్ సార్ ఆయన వెన్నంటే ఉన్నారు. కేంద్రం దిగి వచ్చి 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసినప్పుడు జయశంకర్ సారే దగ్గరుండి మరీ నిమ్మరసం ఇచ్చి కేసీఆర్ దీక్ష విరమింపజేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రకటనపై కేంద్రం వెనక్కి పోతే కేసీఆర్‌‌తో కల్సి మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు నాటి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ‎ఇంటికి వెళ్లి జేఏసీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు జయశంకర్ సారు.

మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి..మా తెలంగాణ మాగ్గావాలి…యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం..ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందనే నమ్మకంతో తుదిశ్వాస విడిచారు.   ఆ స్ఫూర్తి ప్రదాత అందించిన చైతన్యంతో యావత్ తెలంగాణ సమాజం ఒక్కటై తెగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు.. ఇప్పుడు మాష్టారు కలలు కన్న బంగారు తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయడానికి సీఎం కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణ ప్రజలు ముందడుగు వేస్తున్నారు. ఆచార్య జయశంకర్ స్వప్నించిన బంగారు తెలంగాణను సాధించడమే ఆయనకు ఇచ్చిన నిజమైన నివాళి. జీవితాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన తపస్విగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా  ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువై ఉంటారు. జోహార్ మాష్టారు.