Home / ANDHRAPRADESH / ఎడిటోరియల్ : రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్న చంద్రబాబు…!

ఎడిటోరియల్ : రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్న చంద్రబాబు…!

ఎవరికైనా పుట్టినగడ్డపై మమకారం ఉంటుంది. ముఖ్యంగా రాయల సీమ ప్రజలకు తమ గడ్డపై అంతులేని ప్రేమ ఉంటుంది. వారికి ఈ మట్టిపై ఉన్న ప్రేమ, భావోద్వేగాన్ని వెలకట్టలేం. కాని అదేం చిత్రమో..ఏపీ మాజీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పుట్టింది సీమలో అయినా..ఆయనకు ఈ గడ్డపై మమకారం ఉండదు. ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో 9 ఏళ్లు, నవ్యాంధ‌్రప్రదేశ్‌లో 5 ఏళ్లు పాలించినా..తాను పుట్టిపెరిగిన రాయలసీమకు బాబు ఒరగబెట్టిందేమి లేదు. కరువు కాటకాలతో సీమ ప్రజలు పరాయి రాష్ట్రాలకు వలస పోతున్నా..చంద్రబాబు ఏనాడూ పట్టించుకున్నది లేదు. తన పుట్టినిల్లు కంటే మెట్టినిల్లు అయిన కృష్ణా జిల్లా అంటేనే బాబుకు మక్కువ. అందుకే అధికారంలో ఉన్నప్పుడూ కూడా చంద్రబాబు రాయలసీమ కంటే కోస్తాంధ‌్రకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. బాబు 14 ఏళ్ల పాలనలో ఎప్పుడూ ఫ్యాక్షన్ గొడవలు, హత్యారాజకీయాలతో సీమ ప్రజలు తల్లడిల్లారే తప్పా…ఏనాడు అభివృద్ధికి నోచుకోలేదు. స్వయంగా సీమ ప్రజలను రౌడీలు, గూండాలుగా అభివర్ణించి కించపరిచేవారు బాబు. అయితే కాస్తో కూస్తో రాయలసీమ డెవలప్ అయిందంటే వైయస్ హయాంలోనే. ఆయన పాలనా కాలంలో హంద్రీనీవా వంటి..సాగునీటి ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయ్యాయి. కొద్దొగొప్పొ పరిశ్రమలు వచ్చాయి. ఇక బాబు హయాంలో కియా పరిశ్రమ వచ్చిందంటూ గొప్పలు చెప్పుకున్నారు కానీ..కియా వల్ల రాయలసీమ ప్రజలకు ఒరిగిందేమి లేదు. సీఎం జగన్ వచ్చిన తర్వాతే స్థానికులకు కియాలో అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఇక మద్రాసు నుండి విడిపోయిన ఆంధ్రాకు కర్నూలు రాజధానిగా ఉండేది.. అయితే తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్‌‌ ఏర్పడిన తర్వాత పాలకులు రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని, రాయలసీమలో హైకోర్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అవేమి జరుగలేదు. ముఖ్యంగా చంద్రబాబు అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకరించి..మిగతా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. అందుకే బాబు పాలనలోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి, రాష్ట్ర విభజనకు కారణమైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా బాబు మారలేదు. నవ్యాంధ్ర ప్రదేశ్‌లో కూడా గతంలో చేసిన తప్పులేచేశాడు. తన సామాజికవర్గానికి మేలు చేకూర్చేందుకే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను బుట్టలో పడేసి, అమరావతిని రాజధానిగా ప్రకటించాడు. అభివృద్ది అంతా మళ్లీ అమరావతిలోనే కేంద్రీకృతం అయ్యేలా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేయించాడు. ఎన్నికలకు ముందు కడప ఉక్కు పరిశ్రమను సొంతంగా నిర్మిస్తామంటూ బీరాలు పలికి..శంకుస్థాపన చేసి వెళ్లిపోయాడు.

కాగా ఇటీవల అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ బాబు చేసిన తప్పులు చేయడంలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాడు. కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాడు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాడు. అయితే ఇటీవలి వరదల నేపథ్యంలో అమరావతి రాజధానిగా శ్రేయస్కరం కాదన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్పారంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలించేది లేదని…అయితే మరో నాలుగు ప్రధాన నగరాలను రాజధానులుగా డెవలప్ చేస్తామని చెబుతోంది. ముఖ్యంగా రాయలసీమలోని జిల్లాలలో ఒక నగరాన్ని రాజధానిగా ప్రకటించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. అయితే నాలుగు రాజధానులు అయితే తమతోపాటు, అమరావతిపై హైప్ తగ్గుతుందని, రాజధానిలో భూములు కొనుక్కున్న తమ సామాజికవర్గ నేతలకు నష్టం కలుగుతుందని భావించిన చంద్రబాబు..అమరావతి తప్పా..వేరే ఎక్కడా రాజధాని ఉండకూడదు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాడు. అంతే కాదు పరిటాల సునీత వంటి సీమ టీడీపీ నేతలు కూడా రాజధానిగా అమరావతి కొనసాగాలని..అక్కడ నుంచి ఏం తరలించినా తాము ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించడం చూస్తుంటే…వీరికి కుల ప్రయోజనాలే తప్పా..సీమ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదని అర్థమవుతుంది.

అయితే రాయలసీమవాసులు మాత్రం కర్నూలు ను రాజధానిగా ప్రకటించి, సీమలో హైకోర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కర్నూలులో విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు కర్నూలును రాజధానిగా ప్రకటించి, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక టీడీపీ కార్యాలయాన్ని ముట్టిడించి స్థానిక జిల్లా అధ్యక్షుడు..సోమిశెట్టి వెంకటేశ్వర్లను అడ్డుకున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు శ్రీ కృష్ణ కమిటీ నివేదికలను తుంగలో తొక్కి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని వారు మండిపడ్డారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఇటీవల టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజధాని మారిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజధాని, హైకోర్టుకు సంబంధించి రాయలసీమ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని విద్యార్థులు ప్రశ్నించారు. రాయలసీమ రాజధాని స్థాయిలో అభివృద్ధి చెందాలంటే వెంటనే కర్నూలులో లేదా సీమలో ఒక నగరాన్ని రాజధానిగా ప్రకటించి, హైకోర్టును కూడా ఏర్పాటు చేయాల్సిందే. సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తుంటే..చంద్రబాబు తన కుల ప్రయోజనాల కోసమే…రాజధానిపై రగడ చేస్తున్నాడంటూ సీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు నువ్వు సీమలో పుట్టలేదా బాబు…నీలో సీమ రక్తం లేదా..కమ్మగా అమరావతి పాట పాడుతున్నావంటూ..రాయలసీమ ప్రజలు చంద్రబాబుపై మండిపడుతున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat