Home / SLIDER / మిషన్‌భగీరథతో దేశానికి సరికొత్త దిశ.. జార్ఖండ్‌ అధికారి

మిషన్‌భగీరథతో దేశానికి సరికొత్త దిశ.. జార్ఖండ్‌ అధికారి

మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించింది అన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సునీల్ కుమార్. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల పెంపుపై తెలంగాణకు ఉన్న చిత్తశుద్దికి మిషన్ భగీరథ నే నిదర్శనం అన్నారు. ఇవాళ మిషన్ భగీరథ గజ్వెల్ సెగ్మెంట్ లో పర్యటించిన సునీల్ కుమార్, ప్రతీ ఒక్క ఇంటికి శుద్ది చేసిన నీటిని సరాఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు అని ప్రశంసించారు. ముందుగాల ఎర్రవెల్లి గ్రామంలోని మిషన్ భగీరథ నీటి సరాఫరా వ్యవస్థ పనితీరును సునీల్ కుమార్ పరిశీలించారు. కొంతమంది గ్రామస్తుల ఇంటిలోపలి నల్లా కనెక్షన్స్ ను చూసారు. నీటి సరాఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత రచ్చబండ దగ్గర గ్రామస్తులతో మాట్లాడారు. మిషన్ భగీరథ తో పాటు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును తెలుసుకున్నారు. తాను చూసిన ఎన్నో పట్టణాల కంటే ఎర్రవెల్లి బాగుందన్నారు. 24 గంటల తాగునీరు, కరంట్ సరాఫరా అద్భుతం అన్నారు. గ్రామస్తులు ఊరిని చాలా శుభ్రంగా ఉంచుకున్నారని మెచ్చుకున్నారు. ఎర్రవెల్లి ని చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పారు.

అక్కడినుంచి ప్రజ్ఞాపూర్ వెళ్లిన సునీల్ కుమార్, భగీరథ నీళ్లు ఉపయోగిస్తున్న గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక మహిళలు… తెలంగాణ రాక ముందు తాగునీటి కోసం చాలా తిప్పలు పడ్డామని చెప్పుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ భగీరథతో తమ దూప తీరిందన్నారు. భగీరథ నీటిని తాగుతున్నప్పటి నుంచి తమ ఆరోగ్యాలు మెరుగుపడ్డాయన్నారు. భగీరథ నీటిని తాగిన సునీల్ కుమార్, చాలా బాగున్నాయి అన్నారు. ఆ తరువాత సంగాపూర్ లో కొత్తగా కడుతున్న డబుల్ బెడ్ రూమ్ కాలనీ లో ఏర్పాటు చేసిన భగీరథ సరాఫరా వ్యవస్థను పరిశీలించారు. మంచి నాణ్యతతో పనులు చేశారని చెప్పారు. అక్కడి నుంచి కోమటిబండలోని భగీరథ హెడ్ వర్క్స్ ను చూశారు. లాబ్ లో నీటిని పరీక్షించే విధానాన్ని చూశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చక్రవర్తి, ఎస్.ఈ శ్రీనివాస్ చారి, ఈఈ రాజయ్య, డీఈఈ నాగార్జున తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.