Home / ANDHRAPRADESH / నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుంది

నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుంది

నోరు మంచిదైతే… ఊరు మంచిదవుతుందంటారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు, అహంకారం తలకెక్కినప్పుడు నోరు అదుపులో వుండదు… నోటికేదొస్తే అలా మాట్లాడేయడమే… కాని, ఇలాంటి వారికి కాలమే సమాధానం చెబుతుంది. పరిస్థితులే శిక్షలు వేస్తాయి. అలాంటి సమయంలో వారిపట్ల కనీస జాలి, దయ చూపించేవాళ్ళు కూడా మిగలరు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలైన జేసీ సోదరులు..

గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన 151 కోట్ల ఇఎస్‌ఐ కుంభకోణానికి సంబంధించి అప్పటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత శాసన సభ ప్రతిపక్ష ఉపనాయకుడు కింజారపు అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌చేసి కోర్టుకు పెట్టడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం చకచక జరిగిపోయాయి.

గత ప్రభుత్వంలో ఇఎస్‌ఐలో జరిగిన అవినీతి ఆనవాళ్ళకు పక్కా ఆధారాలతోనే ఏసిబి వేట మొదలు పెట్టింది. ఆనాడు ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన మరికొందరు అధికారులను కూడా అరెస్ట్‌ చేయడం జరిగింది. ఇదే క్రమంలో అక్రమంగా బస్సు రిజిస్ట్రేషన్‌, బిఎస్‌3 వాహనాలను బిఎస్‌ 4గా చెప్పి రిజిస్ట్రేషన్‌ చేయడం, లారీలను బస్సులుగా మార్చి ప్రయాణికుల రూట్లలో తిప్పడం వంటి ఎన్నో అక్రమాలకు సంబంధించి దివాకర్‌ ట్రావెల్స్‌ అధినేతలు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన కొడుకు అస్మిత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడం, రిమాండ్‌కు పంపడం కూడా అయ్యింది..

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ విషయంలో తెలుగుదేశం నాయకులు ఏదో మాట్లాడుతున్నారు గాని, సాధారణ ప్రజల్లో వీరిద్దరి అరెస్ట్‌ పట్ల ఎలాంటి వ్యతిరేకతా లేదు, సరికదా తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళు చేసిన ప్రేలాపనలకు తగిన శాస్తే జరిగిందంటున్నారు. చేసిన పాపాలు పండే.. వాళ్ళు జైలుకు పోయారని, వీళ్ళ పట్ల సానుభూతి చూపాల్సిన అవసరం లేదనేది జనాభిప్రాయం..

గత పదేళ్లుగా తెలుగుదేశం నాయకులు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ఎన్నో నిందలు వేస్తూ వచ్చారు. ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే శాసన సభ సమావేశాలలో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, బోండా ఉమ, యరపతినేని శ్రీనివాసరావు లాంటోళ్ళు సంస్కారం, సభ్యత మరచి జగన్‌పై నోటికొచ్చినట్లు వాగారు.. ఇక కృష్ణా జిల్లాలో దివాకర్‌ ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు ప్రమాదానికి గురై 13మంది దాకా చనిపోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా వున్న వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లడం, ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించడమే కాకుండా ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్‌ సంస్థపై విచారణకు డిమాండ్‌ చేశారు. జగన్‌ అలా డిమాండ్‌ చేయడాన్ని జేసీ సోదరులు సహించలేకపోయారు. జేసీ సోదరులలో ఒక్కడైన జేసీ ప్రభాకర్‌రెడ్డి అనంతపురంలో ‘సాక్షి’ కార్యాయం ఎదుట కూర్చోని మాటల్లో చెప్పలేని విధంగా, చేతుల్తో రాయలేని విధంగా జగన్‌ను బూతులు తిట్టడం సభ్య సమాజం మరచిపోలేదు. ఆరోజు జగన్‌పై బండబూతులు తిట్టిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఈరోజు జైలు ఊచల వెనుక చూసి జగన్‌ అభిమానులు ఎంత గానో సంతోషపడుతున్నారు..

అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిదాకా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గత తెలుగుదేశం ప్రభుత్వ అక్రమాలను పట్టించుకోలేదు… ఏడాది దాటగానే వేట మొదలు పెట్టాడు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డితో మొదలైన ఈ వేట… ఇంకెంతమందిని జైలుకు పంపిస్తుందో చూడాలి! చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రతిదీ అక్రమం, అవినీతే! ఇరిగేషన్‌లో వందల కోట్ల కుంభకోణం… మైనింగ్‌ మాఫియా… సిఆర్‌డిఏ స్కాం.. భూముల మాఫియా, డేటా చోరీ… లెక్కలేనన్ని అంశాలలో లెక్కలు తేల్చాల్సివుంది… వీటన్నింటి లెక్కలు తేలితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో అధికార గర్వంతో విర్రవీగిన వాళ్ళు చాలామందికి పోలీసు మర్యాదలు తప్పకపోవచ్చు..

అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌తోటే చంద్రబాబు అండ్‌ కోలో వణుకు మొదలైంది. ఇఎస్‌ఐ స్కాం జరిగిందా? లేదా? అనేదానిని చర్చించకుండా చంద్రబాబు బిసి కార్డు వాడుతూ అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ వాపోతున్నాడు. అయితే అదే సమయంలో ‘రెడ్డి’ వర్గానికి చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ కూడా జరిగిపోవడంతో చంద్రబాబు కుల పాచిక పారలేదు. అంతే గాక, ఇతర పక్షాలు కూడా అవినీతి కేసుల్లో ప్రభుత్వ చర్యలను సమర్ధించడంతో బాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. జగన్‌ ఇదే వూపుతో వేటను కొనసాగిస్తే, గత తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి పునాదులను పెకిలిస్తూపోతే ఇది ఎంతమంది అరెస్ట్‌ల దాకా పోతుందో, ఎంత పెద్ద తలకాయల అరెస్ట్‌ దాకా పోతుందో…. అంతు చిక్కని పరిస్థితి. ప్రస్తుతానికి టిడిపి నేతలకు సినిమా మొదలైనట్లే! ముగింపు ఎలా వుంటుందో ఆసక్తికరమే….

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat