గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శ‌ర‌వేగంగా సాగుతున్న ఎల్‌ఈడీ బల్బుల మార్పిడి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 4,60,000 సాంప్రదాయక వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చే అతి పెద్ద ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫీసియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎల్‌ఈడీ బల్బుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరకు 2 లక్షలకు పైగా ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. ప్రస్తుతం అమర్చిన ఈ 2 లక్షల ఎల్‌ఈడీ బల్బుల వల్ల రోజుకు 7 వేల కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. మొత్తం 4,60,000 విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం వల్ల సంవత్సరానికి 20.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా జీహెచ్‌ఎంసీకి రూ. 14.72 కోట్ల పవర్ బిల్లు ఆదా కానుంది. దీంతో పాటు సంవత్సరానికి 16,587 టన్నుల కార్బన్‌డయాక్సైడ్ తగ్గనుంది. ఇక.. ఈ రోజు వరకు అమర్చిన 2 లక్షల ఎల్‌ఈడీ బల్బుల్లో 18 వాట్స్, 35, 70, 110, 190 వాట్స్ కెపాసిటీ కలిగిన లైట్లు ఉన్నాయి. నగరం మొత్తం ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ విద్యుత్ దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ నిలిచింది. నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లతో ఆయా వీధులు అదనపు కాంతితో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఎల్‌ఈడీ లైట్ల వల్ల రాత్రివేళల్లో జరిగే ప్రమాదాలు కూడా తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు