ప్రధాని మోదీ పదవికి చంద్రబాబు ఎసరు ..

ఏపీలో రాజ్యాంగేతర జన్మభూమి కమిటీలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అసలు టీడీపీ ప్రభుత్వంలో అధికారులకు అధికారాలున్నాయా..? అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండండి అని కలెక్టర్ల సదస్సులో బాబు ఆదేశిలివ్వడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా...మరో ఎమ్మెల్యే బోండా ఉమ,ఎంపీ కేశినేని ట్రాన్స్ పోర్టు కమిషనర్ బాలసుబ్రమణ్యంపై దాడి చేసినా కేసులు పెట్టలేదన్నారు. ఓ వైపు అధికారులను భయపెడుతూ...మరోవైపు, సరిగా పనిచేయడం లేదని మీ తప్పులకు వారిని బాధ్యులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కలెక్టర్ల సదస్సుతో బాబు ఏం చెప్పదల్చుకున్నారని మండిపడ్డారు.

ఐఏఎస్ , ఐపీఎస్, గ్రూప్ 1 అధికారులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా ఉంటే తప్ప మర్యాద ఉండదంటూ బాబు పరిపాలనను సర్వనాశనం చేశారని కొరుముట్ల ధ్వజమెత్తారు. ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ లు ఈ రాష్ట్రంలో పనిచేయలేక భయంతో కేంద్ర సర్వీసుల్లోకి వెళుతున్నారన్నారు. అధికారుల సంతకాలు లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి సీఎం పేషీలో ఎంత దుర్మార్గంగా జీవోలు తయారు చేస్తున్నారో...ఎన్ని కుంభకోణాలు చేస్తున్నారో బాబు మాజీ సీఎస్ స్వయంగా చెప్పిన విషయాన్ని కొరుముట్ల గుర్తు చేశారు.

దీనిపై చర్చకు సిద్ధమా అని టీడీపీకి సవాల్ విసిరారు. టీడీపీ నాయకులు ఇసుక నుంచి ఎర్రచందనం వరకు విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి....వారిని సపోర్ట్ చేస్తూ కేసులు పెట్టొద్దని సీఎం పేషీ నుంచి మెసేజ్ లు వెళ్లడం దారుణమన్నారు. అభివృద్ధి జరగడం లేదని కలెక్టర్లే కారణమని చెప్పదల్చుకున్నారా బాబూ..? మీరు చేసే దుర్మార్గపు చర్యలకు కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులను చేయడం ఎంతవరకు భావ్యమని ఆయన నిలదీశారు.కేంద్రంలో జీడీపీ 5.6 మాత్రమే, ఏపీలో 11.7 జీడీపీ రేటుందని బాబు చెబుతున్నారు. బాబు పాలనలో అంకెల గారడీ ఏవిధంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందన్నారు. అంటే, బాబుకు ప్రధాన మంత్రి పదవిపై కన్నుపడిందా..? ప్రధాని పదవికి మోదీ అర్హుడు కాడని చెబుతున్నారా..? దేశ జీడీపీ తక్కువగా ఉంది, రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని బాబు అంకెలగారడీ చేస్తున్నారని కొరుముట్ల విమర్శించారు.

సంబంధిత వార్తలు