సంక్రాంతి బరిలో దూకిన వైసీపీ ఖైదీ పుంజు.. టీడీపీ శాతకర్ణి పుంజు.. గెలుపెవరిది.?

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి వైసీపీకి దగ్గరైనట్టు కనిపిస్తోంది.. చరిష్మా ఉన్న మెగాస్టార్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీకూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్న చిరంజీవి వేరే పార్టీలో చేరడం ఖాయమని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య ఆయన టీడీపీలోకి వెళ్లడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని హడావిడి జరిగినా అంతా వట్టిదేనని తేలిపోయింది.వైసీపీ ముఖ్యనేత అయిన అంబటి రాంబాబు కూడా చిరంజీవితో వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపారని తెలుస్తోంది. రైతు సమస్యలపై ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు.. దీంతో రైతు సమస్యలపై చిరు తీసిన సినిమా విజయం సాధించాలని వైసీపీ నేతలు ఆకాంక్షించారు. తన రాజకీయ భవిష్యత్తుపై చిరంజీవి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా ఆయన పార్టీ మారే అవకాశం ఉంటే కచ్చితంగా ఆయనను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తామని కొందరు వైసీపీనేతలు చెప్తున్నారు. దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా చిరంజీవి సినిమాపై ఎంతో మొదటినుంచీ సానుకూలంగా స్పందించారు.

చిరంజీవి అన‌గానే గుర్తొచ్చేది డ్యాన్సేన‌ని, 9 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ రావ‌డం అంద‌రికీ సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఆయ‌న‌తో క‌లిసి ముఠామేస్త్రీ, ముగ్గురు మొన‌గాళ్లు, బిగ్‌బాస్ తదితర సినిమాల్లో న‌టించాన‌ని అన్నారు. అంతే కాకుండా సాక్షి టీవీ నిర్వహించిన చిరు ఇంటర్వ్యూను రోజా చేశారు. ‘ఖైదీ’ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో ఈ సినిమా కూడా చిరంజీవికి అంతే పేరు తీసుకురావాల‌ని రోజా కోరుకున్నారు. పైగా చిరు నీరునీరు పాటను జగన్ కు అన్వయించి ఎన్నో వీడియోలు సైతం చేశారు చిరంజీవి, జగన్ అభిమానులు.. గతంలో చిరంజీవి ప్రీ రిలీజ్ వేడుకకు విజయవాడ, గుంటూరులో కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు చంద్రబాబు. దీనినిబట్టి ఖైదీనం.150 సినిమా పూర్తిగా వైఎస్సార్సీపీ సపోర్ట్ సినిమా అనే ముద్ర దాదాపుగా పడింది.. 

ఇక సప్త సముద్రాలను జయించి తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతారాలకు చాటిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత గాథ ఆధారంగా బాలయ్య హీరోగా నటించిన గౌతమి పుత్రశాతకర్ణి.. ఈ సినిమాకు చిత్రానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు వినోదపు పన్నును ప్రకటించారు..అయితే ఏపీ సీఎం చంద్రబాబు తన బావమరిది నటించిన చిత్రానికి వినోదపు పన్నును ప్రకటించారు కానీ గతంలో తాను తీసిన రుద్రమదేవికి పన్ను మినహాయింపు ఇవ్వలేదని దర్శకుడు గుణశేఖర్ ఆరోపించారు. అదే విధంగా స్వయానా వియ్యంకుడు కావడంతో చంద్రబాబు, మావయ్య కావడంతో లోకేశ్ బాబులు బాలయ్యకు మద్దతిస్తున్నారు. చంద్రబాబు శాతకర్ణి ఆడియో వేడుకకు వెళ్లగా లోకేశ్ ట్విట్టర్ ద్వారా పలుమార్లు ట్వీట్ చేశారు. పైగా బాలయ్యకు ధియేటర్లు కేటాయించడంకోసం ఖైదీకి తక్కువ ధియేటర్లు వచ్చేలా కుట్రపన్నారని తెలుస్తోంది. మొత్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ సినిమా ఖైదీ నం.150 కి.. తెలుగుదేశం శాతకర్ణికి సినిమాకు డైరెక్ట్ గానే మద్దతిస్తున్నాయని తెలుస్తోంది. మరి ఈ బరిలో ఆపోరులో అంతిమంగా ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు