నేడు గవర్నర్ భూరికార్డుల పరిశీలన

భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గవర్నర్ నరసింహన్ నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ ఖరారు చేశారు. ఇందులోభాగంగా రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, భూమి రికార్డుల ప్రక్షాళన ప్రాజెక్టు మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం గురించి ఆయనకు వివరించారు. అనంతరం గవర్నర్ పర్యటించనున్న గ్రామాలపై చర్చించారు. 

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నాగశాల గ్రామానికి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకోనున్న గవర్నర్.. అక్కడ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పరిశీలిస్తారు. అక్కడి రైతులతో మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ జిల్లా మెదక్ మండలంలోని పాషాపూర్ గ్రామానికి వెళ్తారు. అక్కడ కూడా రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడుతారు. రికార్డుల ప్రక్షాళన చేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందితో చర్చించి, ఏవిధమైన సమస్యలు వస్తున్నాయి.. వాటిని ఏవిధంగా పరిష్కరిస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకుంటారు.

సంబంధిత వార్తలు