అన్నిరంగాల్లో పెట్టుబడులకు హైదరాబాద్ ఆకర్షణీయం...

ఐటితోపాటు ఇతర పారిశ్రామిక రంగాల్లోనూ పెట్టుబడులకు హైదరాబాద్ ఆకర్షణీయంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూర్, చెన్నయ్ లాంటి నగరాలు దేశ ఐటి రంగానికి ఆయువు పట్టులా ఉన్నాయన్నారు. ఇండియా టుడే మీడియా గ్రూప్ చెన్నైలో నిర్వహిస్తున్న ది సౌత్ ఇండియా కాంక్లేవ్‌ లో ఆయన పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం జరిగిన ‘Why Invest in South: The Case for Change’ సెషన్‌ లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తమిళనాడు, కర్నాటకతోపాటు ఇతర రాష్ర్టాల పరిశ్రమల మంత్రులతోపాటు పలువురు వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని తాము స్టార్ట్ అప్ స్టేట్ గా పిలుస్తున్నమని మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్త వ్యాపార దృక్పథం, పాలసీలతో ముందుకు పోతున్నామని తెలిపారు. తాము రూపొందించిన పాలసీలను ఇతర రాష్ర్టాలు ఆదర్శనీయంగా తీసుకుంటున్నాయని అన్నారు. టియస్ ఐపాస్ లాంటి పాలసీ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు, అనుమతులు ఆలస్యానికి కారణం అయ్యే అధికారులపై జరిమానా వంటి దేశం ఇప్పటిదాకా ఎరుగని విధానాలను తీసుకుని వచ్చామని మంత్రి వివరించారు. సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పడం అనేది తెలంగాణలో వాస్తవ రూపం దాల్చిందని, ఈ అంశాన్ని దేశ విదేశాల్లోని పారిశ్రామిక దిగ్గజాలు ప్రశంసించారని గుర్తుచేశారు. పారదర్శక పాలసీల రూపకల్పనకు తాము సింగపూర్ లాంటి దేశాల్లోని పాలసీలను స్ఫూర్తిగా తీసుకున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తమ ప్రభుత్వ పనితీరుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడమే నిదర్శనమని చెప్పారు. రాష్ర్టాల మధ్య పోటీతోపాటు భాగస్వామ్యం, సమన్వయం కూడా అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పెట్టబడుల ఆకర్షణ కేవలం దేశంలోని రాష్ర్టాల మధ్యనే కాదని, అది ఇప్పడు దేశాల మధ్య అయిందన్నారు. అందుకే రాష్ర్టాల మధ్య సమన్వయంతో, పరిజ్ఞానం, పాలసీల మార్పిడి, సహకారంతో దేశానికి మరిన్ని పెట్టుబడులు తీసుకుని రావచ్చని మంత్రి కేటీఆర్ వివరించారు.

సంబంధిత వార్తలు