తెలంగాణ నేతన్న మల్లేశంకు పద్మశ్రీ పురస్కారం....!

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో చేనేతకు పూర్వవైభవం వస్తున్న వేళ..మంత్రి కేటీఆర్ కృషితో నేతన్నల బతుకులు నిలబడుతున్న వేళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లక్షలాది కార్మికులను ఆనందంలో ముంచెత్తుతూ ఓ వార్త వచ్చింది..అదే మన తెలంగాణ మట్టి బిడ్డ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశంకు కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.. చేనేతకు సంబంధించి వినూత్నంగా ఆసు యంత్రాన్ని కనుగొన్నందుకు గానూ ఆయన ఈ అవార్డును
అందుకోనున్నారు. ఇవాళ కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ విజేతల జాబితాలో యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశం కూడా ఉన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో వెనకబడిన ఆలేరు మండలం, శారాజీపేట అనే మారుమూల గ్రామానికి చెందిన మల్లేశం పెద్దగా చదువుకోలేదు..ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ చదువు మధ్యలోనే ఆపేశాడు..చేనేత వృత్తిలో ఆధారపడిన తల్లి లక్ష్మీకి చేదోడు వాదోడుగా ఉండేవాడు..చీరలు నేయడంలో తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు..మామూలుగా ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18వేల సార్లు దారాన్ని
కండెల చుట్టూ తిప్పితే గాని(25 కి.మీ) రెండు చీరలు తయారు కావు. రెండు చీరలు నేస్తే గాని నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లవు. చేతులు లాగుతున్నాయి బిడ్డా అంటే మల్లేశం తట్టుకోలేకపోయాడు..అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే చలించిపోయిన మల్లేశం..ఎలాగైనా తల్లి బాధను తీర్చాలని ఆలోచించాడు..ఆ ఆలోచనే ఆసుయంత్రానికి పురుడు పోసుకుంది.

2000ల సంవత్సరంలో మల్లేశం కనిపెట్టిన ఈ ఆసు యంత్రానికి అమ్మ పేరుమీదనే లక్ష్మీ ఆసుయత్రం అని పేరు పెట్టాడు. మిషన్ అంటే పెద్ద భారీ యంత్రాలేవి ఉండవు.. రెండు తక్కువ కెపాసిటీ గల మోటర్లు, వుడ్ ఫ్రేమ్. అంతే..ఎవరైనా సరే ఈజీగా ఒక చీర ఆసుపోయవచ్చు. మల్లేశం ఈ ఆసుయంత్రం కనిపెట్టక ముందు రోజుకు రెండు చీరలు నేసేవాళ్లు ఈ యంత్రం వచ్చాక ఆరు నుంచి ఏడు చీరలు నేస్తున్నారు. మామూలు ఆసుపోయడం వల్ల ఐదు నుంచి ఆరు గంటల సమయం
ఒక్క చీర నేయడానికి సమయం పడుతుంది. అదే లక్ష్మీ ఆసుయంత్రంతో గంటన్నర సమయంలో ఒక చీర నేయవచ్చు. 

పెద్దగా చదువుకోని ఓ చేనేత కార్మికుడు కనిపెట్టిన ఈ ఆసుయంత్రం పెద్ద సంచలనమే సృష్టించింది..చింతకింది మల్లేశం కాస్తా ఆసుమల్లేశంగా పేరుగాంచాడు.. 2011 సంవత్సరంలో ఈ యంత్రానికి పేటెంట్ హక్కులు వచ్చాయి. అదే సంవత్సరం చివర్లో ఫోర్బ్స్ జాబితాల మల్లేశం పేరు వచ్చింది. 2011లో ఆసుయంత్రానికి సాఫ్ట్ వేర్ జత చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది...  గతంలో నాటి రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభాపాటిల్‌తోపాటు పలువురు ప్రముఖుల పలు అవార్డులు అందుకున్నాడు 2017 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం చింతకింది మల్లేశం ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.. మల్లేశం ప్రస్తుతం ఆలేరులో చేనేతవృత్తిలో కొనసాగుతూ ఆలేరు  మండల సిల్క్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. మల్లేశం ఆశ ఒక్కటే ఈ వీలైనన్ని చేనేత కుటుంబాలకు లక్ష్మీ ఆసుయంత్రాన్ని సరఫరా చేయాలి.  దేశం గణతంత్ర దినోత్సవ సంబురాలు జరుగుతున్న వేళ..మువ్వెన్నల జెండా రెపరెపలాడుతున్న వేళ తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చాటిన తెలంగాణ మట్టి బిడ్డ చింతకింది మల్లేశంకు పద్మశ్రీ
పురస్కారం రావడంతో మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలు సంబురపడుతున్నారు..
 

సంబంధిత వార్తలు