ఏఐటీయూసీకి గట్టి ఎదురుదెబ్బ

వచ్చే నెల (అక్టోబరు) 5న జరగనున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు ఏఐటీయూసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది! ఏఐటీయూసీ కొత్తగూడెం బ్రాంచ్ మాజీ సెక్రెటరీ వీరభద్రరావు టీబీజీకేఎస్‌లో చేరారు. కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల పట్ల ఆకర్షితులైన ఆయన టీబీజీకేఎస్‌ కు జై కొట్టారు. వీరభద్రరావుకు గులాబీ కండువా కప్పిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్మికుల సంక్షేమానికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్ కృషిని వీరభద్రరావు కొనియాడారు. సీఎం కేసీఆర్ తోనే కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ కేవీ అధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురు లేకుండా దూసుకెళుతోంది. కార్మిక సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కే అండగా ఉంటామని కార్మికలోకం ఘంటాపథంగా చెబుతోంది. సింగరేణి కార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటున్న టీబీజీకేఎస్‌ కు కార్మికులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గులాబీ దళానికే తమ మద్దతని చెబుతున్నారు. కార్మికులను పట్టించుకోని ఇతర సంఘాలకు పరాభవం తప్పదంటున్నారు.

కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎంపీ పొంగులేటి అన్నారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ కోసం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే నీచ రాజకీయాలతో ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నాయని మండిపడ్డారు. ఎప్పటికైనా వారసత్వ ఉద్యోగాలు సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ఎమ్మెల్యే జలగం, ఎమ్మెల్సీ పల్లా అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గనికార్మిక సంఘం అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.

సంబంధిత వార్తలు