ఎడిటోరియల్ : పురచ్చితలైవి మహాభినిష్క్రమణం..!

తమిళుల ఆరాధ్యదైవం , అభిమానులు అమ్మ అంటూ ఆప్యాయంగా పిల్చుకునే తమిళనాడు సీఎం, పురచ్చితలైవి జయలలిత శకం ముగిసిపోయింది. .ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులను, అశేష అభిమానులను దుఃఖసాగరంలో ముంచెత్తుతూ  అనంత లోకాలకు తరలిపోయింది..దీంతో తమిళనాడు ఒక్కసారిగా మౌగబోయింది..తమిళ నేల కన్నీటి సంద్రమైంది..తమిళ ప్రజలు అమ్మా..అమ్మా అంటూ గుండలవిసేలా ఏడుస్తున్నారు..అమ్మను కడసారి చూపు చూసుకోవడా నికి బోరు బోరుమని ఏడుస్తూ రాజాజీ హాల్ వైపు పరుగులు పెడుతున్నారు..అమ్మ మరణవార్త విని ఎన్నో గుండెలు ఆగిపోయాయి..సీఎం జయలలిత మృతితో అఖండ భారతావని దిగ్ర్భాంతి చెందింది..

   తమిళ  రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాలపై జయలలిత చెరగని ముద్ర వేశారు..ఇందిరాగాంధీ తర్వాత అంతటి ధైర్య సాహసాలు ఉన్న మహిళా నాయకురాలు జయలలిత మాత్రమే..వెండి తరపై  గా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కోట్లాది సినీ అభిమానుల ఆరాధ్యదైవంగా మారిన జయలలిత తమిళనాట అత్యంత సాహసోపేతమైప రాజకీయ నాయకురాలిగా ఎదిగారు..సినీ హీరోయిన్ గా కెరీర్ ముగుస్తున్న దశలో 1981లో   తన తోటి సినీ హీరో, రాజకీయ గురువు నాటి సీఎం ఎంజీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు..అయితే ఆమె సినీ కెరియర్ లాగానే రాజకీయ జీవితం కూడా పూల పాన్పు కాలేదు..ఇక్కడా  ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు..పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా ఆ ధీర వనిత వెన్నుచూపలేదు..ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియల్లో వాహనం నుంచి సొంత పార్టీ నేతలే ఆమెను గెంటి వేశారు..ఆ అవమానాలే ఆమెను రాటుదేల్చాయి..ఆ తర్వాత ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ప్రభుత్వం పడిపోవడంతో 1991లో అప్పటికే పార్టీపై పట్టు సాధించిన జయలలిత అనూహ్యంగా సీఎం అయ్యారు..ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసు కోలేదు.. అయితే తమిళనాట 5 ఏళ్లకు ఒకసారి కొత్త ప్రభుత్వాన్నికోరుకోవడం తమిళ ప్రజలకు అలవాటు.. 2001లో అధికారం చేపట్టిన జయ ఆ తర్వాత 2006లో మళ్లీ ఓడిపోయింది..డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకురాలిగా ప్రజల తరపున పోరాడేవారు..అయితే నిండు అసెంబ్లీలో కరుణా నిధి సమక్షంలో జయలలితను డీఎంకే ఎమ్మెల్యేలు  చీరలాగి అవమానించారు..దీంతో జయ అవమానభారంతో కుంగిపోలేదు..డీఎంకే అధికారాన్ని కూల్చిన తర్వాతే మళ్లీ అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు..అన్నమాట ప్రకారం మళ్లీ అధికారంలోకి వచ్చిన జయ  కరుణానిధి కుటుంబాన్ని జైలు పాలుచేసి.తనకు జరగిన అవమానాన్ని ప్రతీకారం తీర్చుకుంది..అందుకే ప్రజలు ఆమెను పురచ్చితలైవి (విప్లవనాయకురాలు)అని పిలుచుకోవడం మొదలుపెట్టారు.. దేశ రాజకీయాల్లోనే ఎవరికీ తలవంచిని నైజం జయలలితది..తనకు నచ్చితే ఏ పనైనా, ఎంత కష్టమైనా అవలీలగా సాధించేవారు...ఇక అమ్మ రెబల్ లీడర్ మాత్రమే కాదు..అత్యంత దయా గుణం గల నాయకురాలు కూడా..తమిళనాడులో ఇంతకు ముందు ఏ పాలకుడు పేదలకు చేయని మంచిని అమ్మ చేసి చూపెట్టింది .అవివాహితగా మిగిలిపోయిన జయలలిత తన జీవితాన్ని తమిళ ప్రజలకే అంకితం చేసింది..తమిళనాడు రాష్ట్రాన్నే తన కుటుంబం అనుకుంది..తమిళ ప్రజలే తన బిడ్డలు అనుకుంది..అందుకే ఓ తల్లి తన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తుందో అంతగా తమిళ ప్రజలను ప్రేమించింది..తన బిడ్డల కోసం అమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే సంచలనాత్మకం అని చెప్పచ్చు..అమ్మ క్యాంటీన్లు, అమ్మ వాటర్, అమ్మ ల్యాప్ ట్యాప్ లు, అమ్మ బేబీ కిట్స్, అమ్మ ఫార్మసీలు, అమ్మ సీడ్స్, ఆఖరికి పేదలకు తక్కువ రేటుకే సినిమా చూపించే అమ్మ సినిమా పథకం..అమ్మ సాల్డ్, అమ్మ సిమెంట్, అమ్మ వెజిటిబుల్స్,అమ్మ మొబైల్స్ ..ఇలా ఒకటేంటి ఎన్నో పథకాలను తమిళ ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంది.ఆ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలందరికీ అందాయి కాబట్టే పేదల `అమ్మ`గా జయలలిత నీరాజనాలు అందుకున్నారు.. 

   తమిళనాట ఓ పార్టీ వరుసగా రెండో సారి గెలవని సంప్రదాయాన్ని తిరగరాస్తూ వరుసగా అమ్మ అధికారం చేపట్టింది..కంటి చూపుతో తమిళ రాజకీయాలను శాసించిన డైనమిక్ లీడర్ జయలలిత..జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజేపీలు కూడా అన్ని రాష్ట్రాలలో రాజకీయాలలో తలదూర్చేవారు కానీ ...తమిళ రాజకీయాల్లో మాత్రం జోక్యం చేసుకునేవారు..జయలలిత తన రాష్ట్ర ప్రయోజనాల విషయంలోఎక్కడా రాజీపడేవారు కాదు..అవసరమైతే కేంద్రంతో ఢీ కొట్టడానికైనా సిద్ధపడేవారు.ఆస్తుల కేసుల్లో జైలు పాలైనా జయలలిత వెరువలేదు..ధైర్యంగా కేసులను ఎదుర్కొన్నారు..ఆమ మనో ధైర్యం ముందు కోర్టులు కూడా తలవంచాయి .నిర్దోషిగా బయటకు వచ్చి  ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారాన్ని చేపట్టారు.. ఓ తమిళ రాజకీయాలను తిరుగులేని విధంగా శాసించిన అమ్మ ఆరోగ్య పరిస్థితి గత రెండున్నరేళ్లుగా క్షీణించసాగింది..గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రచారంలో అమ్మ కనిపించలేదు..ఇంటి దగ్గరే కూర్చుని పార్టీని నడిపించారు.. అమ్మ కనిపించకపోయినా..అమ్మ చేపట్టిన సంక్షేమ పథకాలు  కళ్ల ముందు కదలాడుతుండడంతో తమిళ ప్రజలు రికార్డు స్థాయిలో అన్నా డీఎంకే పార్టీనే గెలిపించారు..ఆ తర్వాత ప్రజల్లో ఎక్కువగా కనిపించలేదు అమ్మ..అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయ్యారు.. 75 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో అపోలో ఆసుపత్రిలో అమ్మ చేరడంతో తమిళ ప్రజలు షాక్ తిన్నారు..మా అమ్మకు ఏం కావద్దు అంటూ ఆసుపత్రి దగ్గరే దేవుళ్లకు పూజలు చేశారు..అయితే గత నెలలో అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని డాక్టర్లు చెప్పడంతో తమిళ ప్రజలు అమ్మ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు..  త్వరలో అమ్మ వస్తుంది..మళ్లీ మమ్మల్ని చల్లగా చూస్తుందని భావించిన తమిళ ప్రజల గుండెలు బద్దలయ్యే వార్త మొన్న 4వ తారీఖు సాయంత్రం బయటకు వచ్చింది..అమ్మకు గుండెపోటు అన్న వార్త విన తమిళ ప్రజల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి..మా అమ్మకు ఏమైంది అంటూ అభిమానులు, మహిళలు ఆసుపత్రి దగ్గరే గుండెలు బాదుకుంటూ విలపిస్తూ
అక్కడే పడిగాపులు కాశారు..అమ్మకు ఏం కాకూడదు....మళ్లీ అమ్మ ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవున్ని ప్రార్థించారు..వారి ప్రార్థనలను భగవంతుడు ఆలకించలేదు..అమ్మను తన దగ్గరికి తీసుకెళ్లాడు..దీంతో తమిళ నేల ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది..తమిళ ప్రజల దుఃఖానికి అంతే లేకుండా పోయింది..కోట్లాది ప్రజల గుండెలు అమ్మా..అమ్మా అంటూ రోదిస్తున్నాయి..వెండితెరపై మకుటం లేని మహారాణిగా ఓ వెలుగు వెలిగిన జయలలిత రాజకీయ
రంగంలో ఇందిరాగాంధీ తర్వాత అంతటి ధైర్యసాహసాలు గల శక్తివంతమైన మహిళా నాయకురాలిగా, విప్లవ నాయకురాలిగా పేరుగాంచారు..అంతే కాదు పేద ప్రజల గుండెల్లో అమ్మగా శాశ్వతంగా నిలిచిపోయారు...పురచ్చితలైవి మహాభినిష్క్రమణం తమిళ ప్రజలకే కాదు..దేశానికే తీరని లోటు..సమకాలీన రాజకీయాల్లో ఇంతటి రాజసం, ధైర్యసాహసాలు, పేదల పట్ల ప్రేమ తత్వం గల నాయకురాలు లేరు..అమ్మకు మరణం లేదు..తమిళ  ప్రజల గుండెల్లో నిత్యం వెలుగుతూనే
ఉంటుంది...అమ్మ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తుంది మా దరువు.కామ్.

 - ఎస్.పి. కస్తూరి.

సంబంధిత వార్తలు