స్వచ్ఛతలో సిరిసిల్ల నంబర్ వన్‌

స్వచ్ఛతలో రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ స్థాయిలో నంబర్ వన్‌గా నిలిచింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంతోపాటు చెత్తసేకరణ, బహిరంగ మలవిసర్జన రహిత విభాగాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర నీటి వనరులు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ స్వచ్ఛత దర్పన్ పేరిట ఆదివారం విడుదలచేసిన ప్రకటనలో ఈవిషయాన్ని వెల్లడించింది. వంద రోజుల వ్యవధిలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు చెత్త సేకరణ, స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాజన్న సిరిసిల్ల జిల్లా.. పశ్చిమ బంగలోని హుగ్లీ, నదియా, ఛత్తీస్‌గఢ్‌లోని దహెమతరీ జిల్లాలతో కలిసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాకు దేశవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన అధికారులు, సహకరించిన ప్రజలకు మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందనలు తెలిపారు. కేటీఆర్ మార్గదర్శకత్వంలోనే జిల్లా అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పేర్కొన్నారు. స్వచ్ఛత దర్పన్‌లో జిల్లా అగ్రస్థానంలో నిలువడంపై ఆదివారం ఆయన కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు

సంబంధిత వార్తలు