తెలంగాణ లో ప్రతి జిల్లాలో ఐదు చేపల మార్కెట్లు : మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

నీలివిప్లవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలి విడతలో ప్రతి జిల్లాలో ఐదు చేపల మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసినట్లు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.  మంగళవారం సచివాలయంలోని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధిశాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.  తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, పశుసంవర్ధకశాఖ ప్రత్యేక కార్యదర్శి సురేశ్‌చందా, విజయా డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, మత్స్యశాఖ కమిషనర్ బీ వెంకటేశ్వర్‌రావు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.  పశుసంవర్ధక, పాడి, మత్స్య, గొర్రెల పెంపకానికి బడ్జెట్‌లో కేటాయింపులు, అవసరమైన నిధులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార్మికులు, గొర్రెల పెంపకందారుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఆయా కులాలకు చెందిన వారు తమ సొసైటీల్లో పేర్లు నమోదు చేయించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రెండు మత్స్య కళాశాలలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో రిజర్వాయర్లతోపాటు చెరువులు, కుంటల్లో పెద్దఎత్తున చేప పిల్లలు పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 100 మొబైల్ క్లినిక్స్‌ను మార్చి చివరిలోగా లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తామన్నారు. విజయా డెయిరీ బ్రాండ్ ఇమేజ్‌పై ఎలాంటి సమస్యలు లేవని, డెయిరీ విభజన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

సంబంధిత వార్తలు