రేపు ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి చిరునామాగా నిలిచిన బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నానికి సర్వం సిద్ధమవుతున్నది. మూడు ప్రపంచ రికార్డులకు హైదరాబాద్‌లోని లాల్‌బహద్దుర్ స్టేడియం ముస్తాబవుతున్నది. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సారథ్యంలో మంగళవారం జరిగే మహా బతుకమ్మ వేడుకకు తెరలేచింది. రాష్ట్రంలోని అన్నిజిల్లాల నుంచి 40 వేల మంది ఆడబిడ్డలు ఈ సంబురంలో పాల్గొనేందుకు ఉవ్విళ్లురుతున్నారు. గతేడాది పదివేల మంది మహిళలతో నిర్వహించిన మహా బతుకమ్మ రికార్డును తిరుగరాసేందుకు అంతా రెడీ అవుతున్నది. గ్రామాలు, చెరువులు, సరస్సులు పులకించిపోయేలా జరిగే ఈ వేడుకను చూసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు. మంగళవారం జరిగే మహా బతుకమ్మకు, 28న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సద్దుల బతుకమ్మ ఉత్సవానికి సూరత్, ముంబై, పుణె, బరంపురం తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు రానున్నారు. సమీప రంగారెడ్డి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి మహిళలు మధ్యాహ్నం రెండింటికే ఎల్బీ స్టేడియం చేరుకునేవిధంగా జిల్లాల కలెక్టర్లు చొరవచూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఇప్పటికే ఆదేశించారు. మిగతా జిల్లాల మహిళలు మూడుగంటలవరకు చేరుకోనున్నారు. ఎల్బీ స్టేడియంలో 25 అడుగుల ఎత్తయిన మహా బతుకమ్మను సిద్ధం చేస్తున్నారు. దీనిని రాష్ట్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ డిజైన్ చేశారు.

సంబంధిత వార్తలు