Home / EDITORIAL / ఎడిటోరియల్…యాడబోయినవ్ చిన్నమ్మ…!

ఎడిటోరియల్…యాడబోయినవ్ చిన్నమ్మ…!

పొద్దుగాల పొద్దుగాల లేవంగానే టీవీ పెట్టిన..మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరణించిన వార్త కనిపించింది…కాసేపు నమ్మలేకపోయిన..చిన్నమ్మ మనల్ని విడిసిపెట్టడం ఏంటీ, ఆ వార్త నిజం కాదు కాకూడదు అని మళ్లీ చూసా…నిజంగానే చిన్నమ్మ ఇక లేరనే కనిపించింది. ఒక్కసారిగా కళ్లలోంచి కన్నీళ్లు వచ్చేసాయి. యాడబోయినవ్ చిన్నమ్మా అంటూ..గొంతు జీర బోయింది..మనసు ఆర్థ్రమైంది. చిన్నమ్మ ఇక లేదని తెలిసి దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. మన ఇంట్లో మనిషి వదిలేసి పోతే ఎంత బాధ ఉంటుందో…చిన్నమ్మ లేదని వార్త తెలిసాక గుండె పగిలినట్లయింది. ఎందుకు చిన్నమ్మ అంటే మనందరికి ఇంత ప్రేమ..ఆమె దేశం గర్వించదగిన మహానాయకురాలు, 25 ఏళ్లకే హర్యానా క్యాబినెట్‌లో యువ మంత్రిగా, ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా, ఏడు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా, మాజీ విదేశాంగ మంత్రిగా దేశానికి అపారమైన సేవలు అందించారు. ఇవన్నీ ఆమె సమర్థతను, పాలనా దక్షతను చాటుతాయి. కానీ అందరి రాజకీయ నాయకుల కంటే చిన్నమ్మది మహోన్నత వ్యక్తిత్వం. ఆమెది తల్లి మనసు..కుల, మతం, ప్రాంతం, దేశాలకు అతీతంగా ప్రజలందరినీ తన సొంత బిడ్డల్లా ప్రేమించారు. అంతే కాదు…ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే వారు మన దేశం బిడ్డలా..శత్రుదేశం బిడ్డలా అని చిన్నమ్మ చూడదు…ఎందుకంటే శత్రు దేశానికి చెందిన వారు కూడా తన బిడ్డలే అని భావించేవారు. అందుకే ఎవరైనా సాయం కోరి వస్తే..శత్రుదేశం అని కూడా చూడకుండా  వారి ప్రాణాలు కాపాడేది. ఆపదలో ఉన్న వారిని ఆత్మీయంగా గుండెలద్దుకుని ఓ తల్లిలా భరోసా ఇచ్చేది. అందుకే సుష్మమ్మ..దేశ ప్రజలందరికీ అమ్మ తర్వాత అమ్మ…చిన్నమ్మ అయింది. ఒక్క మన దేశంలోనే కాదు..పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలకు కూడా ఆమె అమ్మే. ఆయా దేశాల నుంచి ఎందరికో వైద్య సహాయం అందించి వారి ప్రాణాలు కాపాడిన అమ్మ…మన చిన్నమ్మ. దేశాలకు అతీతంగా విశ్వజనీనమైన ప్రేమను అందించిన గొప్ప తల్లి…మన చిన్నమ్మ.

భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సుష్మా స్వరాజ్ మరణంతో యావత్ దేశంతో పాటు తెలంగాణ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటుంది. చిన్నమ్మ ఇక లేదని తెలిసి తెలంగాణ మూగబోయింది. తెలంగాణ ప్రజలతో చిన్నమ్మకున్న అనుబంధం ఏనాటికి మరువలేనిది. తెలంగాణ ఉద్యమంలో మన బిడ్డలు ఆత్మార్పణం చేసుకుంటుంటే..చిన్నమ్మ ఓ తల్లిలా తల్లడిల్లిపోయింది. అమరులను తలుచుకుని కన్నీరు పెట్టుకుంది. మన బతుకమ్మ ఎత్తుకుని తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికింది. నాలుగు లక్షల మంది ఉద్యోగులు, వేలమంది న్యాయవాదులు, తెలంగాణ ప్రజలు యావత్తూ.. ధర్నాలు, హర్తాళ్లు, నిరసనలు తెలుపుతూ ఉంటే.. కేంద్రం ఏం చేస్తున్నది..? కనీసం వారి బాధ ఏమిటనేది తెలుసుకోవద్దా..? వెంటనే బిల్లు పెట్టండి మద్దతు ఇస్తామంటూ పార్లమెంట్‌లో తెలంగాణ కోసం గర్జించిన చిన్నమ్మ గొంతు ఇంకా వినిపిస్తూనే ఉంది. ఎందుకు తెలంగాణ వెనకబడిందో, తరతరాలుగా ప్రజలు ఎన్నెన్ని కష్టాలు ఎదుర్కొన్నారో లెక్కలతో సహా పార్లమెంటులో విడమర్చి చెప్పింది మన చిన్నమ్మ. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని పెద్దమ్మగా భావించాలని, బిల్లుకు మద్దతు ఇచ్చిన తనను చిన్నమ్మగా పిలవాలని సుష్మమ్మ తెలంగాణ ప్రజలకు చెప్పేది. చిన్నమ్మ అని పిలుస్తుంటే మురిసిపోయేది.

చిన్నమ్మ అనగానే వెంటనే నేనున్నానంటూ ఓ తల్లిలా భరోసా ఇచ్చేది. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ బిడ్డలు గల్ఫ్ దేశాల్లో నానా యాతనలు పడుతుంటే..తెలంగాణ ప్రభుత్వం కోరిన వెంటనే బాధితులను సొంత ఊరికి పంపించేది. చిన్నమ్మకు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలంటే అంటే ఎంతో ఇష్టం.. సందర్భం ఎప్పుడు వచ్చినా తెలంగాణ గురించి గొప్పగా చెప్పేది. 2017 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో సుష్మాస్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా పాల్గొన్నారు. నేను తెలంగాణ చిన్నమ్మను అంటూ చెప్పడంతో.. సమావేశం యావత్తూ.. హర్షధ్వానాలతో మిన్నంటింది. అంతగా ఆమె తెలంగాణ ప్రజలకు ఆత్మీయులయ్యారు. ఇలా చిన్నమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిండైన కట్టుబొట్టుతో భారతీయ మహిళకు ప్రతిరూపంగా, ప్రతి ఒక్కరికి ఓ అమ్మలా కనిపించే చిన్నమ్మ ఇక లేదనే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి మనసుకు కష్టంగా ఉంది. చిన్నమ్మ ఇక లేదని తెలిసి..కన్నీరు పెట్టని తెలంగాణ బిడ్డ లేడు. మమ్మల్ని వదిలేసి ఎల్లిపోయినవా చిన్నమ్మా…యాడ బోయినవ్ చిన్నమ్మా అంటూ ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టుకుంటున్నడు…చిన్నమ్మ ఎక్కడకి వెళ్లిపోలేదు..అత్యంత ప్రతిభాపాటవాలు గల మహిళగా, భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ధీరవనితగా, గొప్ప దౌత్యవేత్తగా, అంతకు మించి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకురాలిగా, అన్నింటికి మించి కుల, మతం, దేశాలకు అతీతంగా ప్రజలందరిని తన బిడ్డలుగా ప్రేమించిన అమ్మగా… చిన్నమ్మ కలకాలం మన గుండెల్లో నిలిచిపోతుంది. చిన్నమ్మా..మీకు మరణం లేదు… ..మళ్లీ రా చిన్నమ్మా…అంటూ ప్రతి తెలంగాణ బిడ్డ మీ కోసం దేవుడిని వేడుకుంటూనే ఉంటాడు. జోహార్ చిన్నమ్మా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat