Home / EDITORIAL / నివేదా థామస్‌ తో ప్రత్యేక ఇంటర్వూ..

నివేదా థామస్‌ తో ప్రత్యేక ఇంటర్వూ..

తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా… తన సహజ నటనతో తెలుగింటమ్మాయే అనిపించుకుంది నివేదా థామస్‌. ఎనిమిదేళ్ల వయసు నుంచీ నటిస్తున్నా.. చదువుకీ సమప్రాధాన్యం ఇచ్చింది.ఓ వైపు ఆర్కిటెక్చర్‌ చివరి ఏడాది చదువుతూ, మరో వైపు హిట్‌లను తన ఖాతాలో వేసుకుంటున్న ఆమెతో ప్రముఖ మీడియాకిచ్చిన  ప్రత్యేక ఇంటర్వూ మీకోసం ..
* జై లవకుశ విజయాన్ని ఆస్వాదిస్తున్నట్టున్నారు..?
అవునండీ! చాలా సంతోషంగా ఉంది…నేను తెలుగులో చేసిన మూడు సినిమాలూ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడం నిజంగానే అభిమానుల దీవెనలే. ఆ విజయాలు నా కెరీర్‌కు చక్కటి అనుభవాన్ని ఇచ్చాయి. తారక్‌ బాగా ఎనర్జిటిక్‌. తనెంత ఉత్సాహంగా ఉంటాడో…చుట్టూ వాతావరణాన్నీ అలాగే ఆహ్లాదంగా మార్చేస్తాడు. అతనితో కలిసి పనిచేయడం నిజంగానే నా అదృష్టం. ఈ సినిమాతో రాశీ మంచి స్నేహితురాలైపోయింది.

‘జెంటిల్‌మన్‌’, ‘నిన్నుకోరి’ చేశా కదా. నాకు నానీ అభిమాననటుడు అయిపోయాడు. ఈ రెండింటికన్నా ముందే మలయాళంలో నానీ సెగ సినిమా చూశా. ఆ తరవాత తెలుగులో ‘అష్టాచెమ్మా’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ కూడా చూశా. ఎంతో అభిమానంగా ఉంటాడు. ఏ విషయాన్నయినా సులువుగా పట్టేస్తాడు. సహ నటిగా తన నుంచి అదే నేర్చుకున్నా. అలాగే మోహన్‌లాల్‌, కమలహాసన్‌, ఎన్టీఆర్‌ల నుంచి నటనలో ఎన్నో మెలకువలు తెలుసుకున్నా.

* మీ కుటుంబం…
చెన్నైలో స్థిరపడిన మలయాళీ కుటుంబం మాది. మా స్వస్థలం కేరళలోని కన్నూర్‌. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నాన్న దుబాయ్‌లో ఉద్యోగం చేస్తారు. తమ్ముడు నిఖిల్‌.

* తెలుగులో చక్కగా మాట్లాడుతున్నారు. ఎలా నేర్చుకున్నారు?
నేను మొదట్లో అనుకున్నా. తమిళం, మలయాళం వచ్చినవాళ్లు తెలుగు ప్రాంతంలోనూ ఉంటారు కదా.. నాకు ఏ ఇబ్బందీ రాదనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక అందరూ తెలుగులోనే మాట్లాడం చూశా. మొదట్లో ఏం చేయాలో అర్థంకాలేదు. తెలుగులో ఒక్క పదం కూడా రాదు. చివరకు చుట్టూ ఉన్నవారిని గమనించాక తప్పు మాట్లాడినా సరే తెలుగులోనే తప్పనిసరిగా మాట్లాడాలనే నియమం పెట్టుకున్నా. అలా ఎన్ని తప్పులు మాట్లాడానో నాకు తెలుసు. ఓ సారి జెంటిల్‌మన్‌ సెట్‌లో వేడినీళ్లు కావాలని అడగడానికి బదులు ఎండ నీళ్లు కావాలి అని అడిగా. అలాంటి తప్పులన్నీ సరిదిద్దుకుంటూ వస్తున్నా. ఇప్పటికీ తెలుగులో Œ బాగా మాట్లాడాలనే ప్రయత్నిస్తున్నా.

* 2008లో బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్‌గా మీరు కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారట? అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు?
నేను సినిమాల్లోకి రావడం అనుకోకుండా జరిగింది. నా ఫొటోలు చూసి వెరుతేవరు భార్య అనే మలయాళ సినిమా దర్శకుడు నటించమని అడిగాడు. అది సూపర్‌ హిట్‌ అయ్యింది. అప్పుడు నాకు ఎనిమిదేళ్లంతే. ఎలా నటించాలో తెలియదు. అయినా పొరపాట్లు చేస్తూనే ఆ సినిమా పూర్తిచేశా. కానీ ఆ తరవాత వరస పెట్టి అవకాశాలొచ్చాయి. దాంతో అమ్మానాన్నలూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్చే ఇప్పుడు ఉపయోగపడుతోంది. సినిమా ఎంచుకోవడానికి ముందు స్క్రిప్టు మొత్తం చదువుతా. ఆ తరవాతే నిర్ణయం తీసుకుంటా. నాన్నకు నా మీద నమ్మకం ఎక్కువ. చిన్నప్పటి నుంచీ ‘మా అమ్మలా మంచి పరిణతితో మాట్లాడుతుంది !’ అంటారు.

* ఎనిమిదేళ్లకే సినిమాలు అంటే…మరి చదువు?
సినిమాలు చేస్తున్నా చదువుని ఏ రోజూ నిర్లక్ష్యం చేయలేదు. రెండు పడవల మీద ప్రయాణం నాకు ఎప్పుడూ ఒత్తిడిగానూ అనిపించలేదు. ‘సినిమాలు చేస్తున్నా.. చదువు కూడా ఉన్నప్పుడు నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంద’ని నాన్న చెప్పేవారు. అందుకే చదువుకీ సమానంగా ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. నిజానికి నేను స్కూలుకి నెలలో రెండు మూడు రోజులు మాత్రమే వెళ్లేదాన్ని. అయినా మంచి మార్కులు వచ్చేవి. నేను చదివిన స్కూలూ, కాలేజీ యాజమాన్యాలు నాకెంతో సహకరించేవి. మా స్కూలు ప్రిన్సిపల్‌ బ్రదర్‌ జార్జ్‌ నేను అప్పుడప్పుడూ స్కూలుకి వెళ్లినా ‘మళ్లీ ఎప్పుడు షూటింగ్‌..?’ అని అనేవారు. ఇప్పుడు నా స్నేహితులకు తెలుగు రాకపోయినా నాకోసం సినిమా చూస్తారు. నన్ను ఇప్పటికీ నివేదాగానే చూస్తారు తప్ప ఓ నటిగా కాదు. అందుకే నేను కూడా కాలేజీలో విద్యార్థిగా, స్నేహితురాలిగా, ఇంట్లో కూతురిగానే ఉంటాను. అలా ఉండగలిగితేనే మనం ఆప్యాయతల్నీ, వారి అభిమానాల్ని కోల్పోకుండా ఉంటాం మరి. అయితే అభిమానుల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుందని అందరికంటే ముందే కాలేజీకి వెళ్లిపోతా. ప్రస్తుతం ఆర్కిటెక్చర్‌ నాలుగో ఏడాది చదువుతున్నా.

* అభిమానుల గురించి…
మొదటి సినిమాకే ఇరవై ఒక్కేళ్ల అమ్మాయిలా నటించాల్సి వచ్చింది. అంత చిన్న వయసులోనే అభిమానులు నన్ను గుర్తించడం, పలకరించడం చాలా సంతోషంగా అనిపించేది. వారి దీవెనలతోనే ఈ స్థాయికి వచ్చానేమోనని అనిపిస్తుంది.

* ఇప్పటివరకూ మీరు చేసిన పాత్రల్లో కాస్త కష్టంగా అనిపించింది?
‘నిన్నుకోరి’లో పల్లవిగా చేయడం! పల్లవి పాత్ర కేవలం స్క్రిప్టు చదివి నటిస్తే అయిపోదు. చాలా భావోద్వేగాలు పలికించాలి. ప్రేమ, కోపం, బాధ వంటివన్నీ ఏకకాలంలో చూపించగలగాలి. అందుకే నాకు కాస్త కష్టంగా అనిపించింది. దానికోసం ఎంతో హోంవర్క్‌ కూడా చేశా.

* ఇంట్లో ఎలా ఉంటారు?
అందరి అమ్మాయిల్లానే నేనూ మా అమ్మకి కూతురిలా ఉంటా. ఖాళీ దొరికితే చాలు.. వంటింట్లో అమ్మకు సాయం చేస్తా. గిన్నెలూ తోముతా. నా గది నేనే శుభ్రం చేసుకుంటా. అప్పుడప్పుడూ వంట కూడా బాగా చేస్తా. బిర్యానీ అద్భుతంగా చేస్తా తెలుసా..

* మీ లక్ష్యం…
చిన్నప్పటి లక్ష్యాలు ఇప్పుడు లేవు. వయసుతోపాటు మారిపోతూ వచ్చాయి. మొదట్లో అస్ట్రోనాట్‌ కావాలనుకున్నా. తరవాత టీచర్‌ని అవ్వాలనుకున్నా. నటినయ్యా. ఆర్కిటెక్ట్‌గానూ స్థిరపడబోతున్నా. మరికొన్నేళ్లు నటనలో నిలబడి ఆపై ఆర్కిటెక్ట్‌గా పనిచేయాలని నిర్ణయించుకున్నా.

* తీరిక దొరికితే.. ఏం చేస్తారు?
అటు సినిమా, ఇటు చదువుతోనే సమయం గడిచిపోతుంది. ఖాళీ సమయం దొరికేది తక్కువే. ఈ రెండూ కాకుండా ఖాళీ దొరికితే మాత్రం స్నేహితులతో కలిసి కూర్చుని కప్పు కాఫీ తాగుతూ హాయిగా కబుర్లు చెప్పుకోవాలని అనిపిస్తుంది. ఇంకా ఖాళీ దొరికిందా… బ్యాడ్మింటన్‌ తరగతులకు వెళ్తాను. అదీ లేదంటే టీవీ చూస్తా.

* చేయాలనుకునే డ్రీమ్‌ రోల్‌ ఏదైనా ?
అన్నిరకాల పాత్రలూ చేయాలనుకోవడమే నా డ్రీమ్‌. ‘తనూ వెడ్స్‌ మనూ’ లో కంగనలా, బాజీరావ్‌ మస్తానీలో దీపికలా, బర్ఫీలో ప్రియాంక తరహా పాత్రలు చేయాలని ఉంది.

* అందంకోసం…
నీళ్లెక్కువ తాగుతా. పోషకాహారం తీసుకుంటా. వ్యాయామం చేస్తాను. ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నప్పుడు అందంగానూ కనిపిస్తాం అని నమ్ముతాను. బయటికి వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌లోషన్‌, సన్‌గ్లాసెస్‌ తప్పనిసరిగా వాడతాను. వ్యాయామంలో శిక్షణ ఇచ్చేందుకు ఇంటికి ప్రత్యేకంగా ట్రైనర్‌ వస్తారు ..

By -స్వాతి కొరపాటి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat