Home / SLIDER / మంత్రి కేటీఆర్ చొరవతో కలను సాకారం చేసుకున్న దళిత యువకుడు…

మంత్రి కేటీఆర్ చొరవతో కలను సాకారం చేసుకున్న దళిత యువకుడు…

ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పట్టుదలకు పేదరికం అడ్డురాలేదు. జీవితాన్ని మార్చుకోవాలన్న కసికి విధి సలామ్ చేసింది. అందుకే అటెండర్ గా ఉన్న పిట్ల నర్సింహులు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడానికి అర్హత సాధించాడు. యువతకు ఐకాన్ గా ఉన్న మంత్రి కేటీఆర్ కే స్పూర్తిగా నిలిచాడు. చేసే చిన్న సహాయం పెద్ద విజయంగా మారితే కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది. అలాంటి సంతోషాన్ని మంత్రి కె.తారకరామారావు కు కలిగించాడు నర్సింహులు.
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన దళిత యువకుడు పిట్లా నర్సింహులుకు పుట్టుకతోనే అంగవైకల్యం. అయినా సరే విధిరాతకు ఎదురొడ్డి, వైకల్యాన్ని అధిగమించి పీజీ పూర్తి చేశాడు. ఇంకా చదవాలనుకున్నాడు. పెద్ద ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఓ వైపు వయసైపోయిన తల్లిదండ్రులు, మరోవైపు పెళ్లీడుకొచ్చిన నలుగురు చెల్లెళ్లు, నర్సింహ ఆలోచనలను మార్చేశారు. దీంతో ఏదో ఒక ఉద్యోగం చేసి ఇంటిని పోషించాలనుకున్నాడు. సిరిసిల్ల, కరీంనగర్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఒకరోజు మంత్రి కేటీఆర్ గ్రామసభ జరుగుతుందని తెలుసుకుని వెళ్లాడు. మంత్రిని కలిసి తన పరిస్థితి చెప్పుకున్నాడు. ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తే తన కుటుంబం ఆకలి తీరుతుందన్నాడు. నర్సింహులు మాటల్లో నిస్సహాయత వినిపిస్తున్నా, ఆయన కళ్లలో మాత్రం ఏదో సాధించాలన్న కసి కనిపించింది. సిరిసిల్లలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం ఇప్పించిన కేటీఆర్, నర్సింహులు పై చదువులకు అండగా ఉండాలనుకున్నారు. ఏ సహాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధమే కాని, ఇంకా చదువుకోవాలని  మాట తీసుకున్నారు.
పీజీ పూర్తి చేసిన నర్సింహా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష JRF కు ప్రిపేర్ అయ్యాడు. మంత్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు తన కలలను సాకారం చేసుకోవడానికి అదే సరైన దారి అనుకున్నాడు. కష్టపడ్డాడు. పరీక్షలో పాస్ అయ్యాడు. జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్ కూడా సాధించాడు. కేవలం దేడ్ సాల్ లోనే ఉద్యోగం కోసం ఇబ్బందులు పడే పరిస్ధితి నుంచి ఉన్నత చదువులకు సరిపడే ఫెలోషిప్ సాధించాడు.
నర్సింహులు విజయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్, ఇవాళ ఆయన్ను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఖర్చుల కోసం రెండు లక్షల రూపాయల అర్ధిక సాయాన్ని అందించారు. పూరి గుడిసెలో ఉంటున్న నర్సింహులు కుటుంబానికి ఒక డబుల్ బెడ్ రూం ఇళ్లు  నిర్మించి ఇస్తామన్నారు. వచ్చే దసరా నాటికి కొత్త ఇంటిలో భోజనం చేస్తానని నర్సింహులుకు మాటిచ్చారు. అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయించిన నర్సింహులు గెలుపు తన లాంటి వాళ్లకు స్పూర్తినిస్తుందన్నారు. ఇవాళ యువజన దినోత్సవం జరుపుకుంటున్న యువతకు నర్సింహులు రియల్ ఇన్ స్పిరేషన్ అన్నారు.  స్పష్టమైన లక్ష్యంతో ప్రయత్నిస్తే కష్టాలెన్ని ఎదురొచ్చినా కలను నెరవేర్చుకోవచ్చన్న నిజం మరోసారి తెలిసిందన్నారు. నర్సింహులుగా మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు.
నర్సింహులు కేవలం అటెండర్ గా మాత్రమే మిగులుతాడని మొదట్లో అనుకున్నామన్నారు వెన్నెల జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ చైతన్య కుమార్. కాని ఎప్పటికప్పుడు వైకల్యాన్ని ఎదురించి ముందుకు సాగిన నర్సింహులు తెగింపు చూసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పారు. అందుకే కొన్ని రోజులు కాలేజీకి రాకుండా చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించామన్నారు. అటెండర్ నుంచి అసిస్టెంట్ ఫ్రొఫెసర్ అయ్యే స్థితికి ఎదిగిన నర్సింహులును చూసి తాము గర్వపడుతున్నామన్నారు.తనకు ఉద్యోగం ఇచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ చైతన్య కుమార్, ఉద్యోగం ఇప్పించిన మంత్రి కేటీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు నర్సింహులు.  వైకల్యం కష్టపెడుతున్నా, పేదరికం అవస్థ పెడుతున్నా, తన తల్లిదండ్రులు మాత్రం తనను ఎన్నడూ చదువుకు దూరం చేయలేదని గుర్తుచేసుకున్నాడు. తలిదండ్రుల గురించి చెపుతూ నర్సింహులు భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. నర్సింహులు లాంటి ఎందరో యువకులు మన చుట్టూనే ఉంటారని, అలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు మంత్రి కేటీఆర్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat